Haj Arrangements: విజయవాడ నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి, 27 నుంచి జెడ్డాకు ప్రత్యేక విమానాలు
22 May 2024, 12:55 IST
- Haj Arrangements: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏపీ నుంచి వెళ్లే యాత్రికులకు బస సదుపాయాన్ని కల్పించింది. 27 నుంచి హజ్ యాత్ర మొదలు కానుంది.
హజ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు
Haj yatra: ఆంధ్రప్రదేశ్ నుండి 2024లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమశాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది.
కేసరపల్లి గ్రామంలోని ఈద్గా మసీదు ప్రాంగణంలో యాత్రికులకు బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మైనారిటీ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు జారీ చేసింది.
హజ్ క్యాంప్ ను విజయవంతం చేయటానికి అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టినట్టు వివరించారు. హజ్ యాత్రికులు యాత్రను సౌకర్యవంతంగా చేయడానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులు యాత్రికులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు.
హజ్ యాత్రకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల యాత్రికులను మూడు ఫ్లయిట్ లలో టిక్కెట్లు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లే వారితో మొదటి ప్లయిట్ మే 27న బయలుదేరుతుంది. రెండవ ఫ్లైట్ మే 28న, మూడవ ప్లైట్ మే 29న గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి చేరుతాయి.
యాత్రకు వెళ్లే యాత్రికులకు, వారి ప్రయాణ వివరాలను, హజ్ క్యాంప్‌లో రిపోర్టింగ్ చేయాల్సిన సమయాలను వాట్సాప్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. హజ్ క్యాంప్‌ను గన్నవరం జిఎస్టీ రోడ్డులో ఉన్న ఈద్గా జామ మసీదులో నిర్వహిస్తున్నట్టు వివరించారు.
హజ్ వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం 1800-4257873 టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించామని, యాత్రికులు ఏదైనా సమాచారం కావలన్నా, టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ వెబ్ సైటు https://apstatehajcommittee.com/ వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం దాదాపు 2900మంది ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, హజ్ యాత్రకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసిందని, జెడ్డా వెళ్లే యాత్రికులు, బయట వ్యక్తుల సహాయ సహకారాలు ఆశించకుండా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ సదుపాయాన్ని వినియోగించుకుని తమ యాత్రను విజయవంతం చేసుకోవాలని సూచించారు. హజ్ యాత్రకు వెళ్లే వారిని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలవడంపై కూడా ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించారు.