AP Academic Calender : ఈ విద్యా సంవత్సరంలో 220 పనిదినాలు….
27 June 2022, 11:45 IST
- 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 220 రోజులు పాఠశాల పనిదినాలుగా ఖరారు చేశారు. జులై ఐదు నుంచి స్కూళ్లు ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 29వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ప్రకటించింది.
ఏపీలో ఈ ఏడాది స్కూళ్లకు 220 పనిదినాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరంలో 220 రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. వారాంతపు సెలవులు, దసరా సెలవులు, పండుగలు, జాతీయ సెలవు దినాలను మినహాయించి మిగిలిన రోజుల్ని లెక్కించి షెడ్యూల్ ఖరారు చేశారు. జులై ఐదు నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలలకు అందుబాటులో ఉండే మూడు స్థానిక సెలవుల్ని వినియోగించుకుంటే వాటి స్థానంలో రెండో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఏటా జూన్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరం ఈ ఏడాది రెండు వారాలు ఆలశ్యంగా జులైకు మారింది. జూన్ 12న మొదలు కావాల్సిన పాఠశాలలు గత ఏడాది విద్యా సంవత్సరం ఆలశ్యం కావడం, అమ్మఒడి పథకం అమలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల దాదాపు 20రోజులు వెనక్కి వెళ్లింది. ప్రైవేట్ పాఠశాలలు, సిబిఎస్‌ఇ స్కూళ్లలో బోధన ప్రారంభమైనా, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం జులై ఐదున తెరుచుకోనున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ముగుస్తాయి. ప్రతి వారం సగటున 48 పీరియడ్లు ఉండేలా ప్రణాళిక విడుదల చేశారు. హైస్కూళ్లలో సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పీరియడ్లలో బోధించాల్సి ఉంటుంది.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్ధులకు బడులు తెరిచిన మొదటి 40రోజులు విద్యార్ధుల్ని సంసిద్ధుల్ని చేసే తరగతులు నిర్వహిస్తారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు నెలరోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30వరకు పనిచేస్తాయి. సాయంత్రం 3.30 నుంచి నాలుగు గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ బడుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు తరగతులు ఉంటాయి. సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ఆటలు, పునశ్చరణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే పాటించాలని సూచించారు.
సెప్టెంబర్‌లో దసరా సెలవలు….
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులుగా ప్రకటించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇఆస్తారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలల్లో దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16వరకు ఉంటాయి.
పరీక్షల షెడ్యూల్……
ఫార్మెటివ్ 1 పరీక్షలు సెప్టెంబర్ 7-9 మధ్య, ఫార్మెటివ్ 2 పరీక్షలు అక్టోబర్ 13-15 తేదీలలో నిర్వహిస్తారు. సమ్మెటివ్ -1 పరీక్షలు నవంబర్ 21 నుంచి 30 వరకు, ఫార్మెటివ్ 3 పరీక్షలు జనవరి 19-21 మధ్య, ఫార్మెటివ్ 4 పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 8వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్ధులకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులకు ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ 13నుంచి 27వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 29తో విద్యా సంవత్సరం ముగియనుంది.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు జూన్ 28 నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్ధుల నుంచి పాతపుస్తకాలు సేకరించి బుక్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు, వార్డు సచివాలయ సిబ్బందితోో సమన్వయం చేసుకుని జులై 5 నుంచి విద్యా కానుకల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.
టాపిక్