AP RTA Citizen : ఏపీ రవాణాశాఖ కీలక నిర్ణయం- లైసెన్స్, ఆర్సీ కార్డులు నిలిపివేత
19 August 2023, 15:42 IST
- AP RTA Citizen : ఏపీ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లైసెన్స్, ఆర్సీ కార్డులు కార్డులు జారీ చేయమని తెలిపింది. వాహన తనిఖీ సమయాల్లో డిజిటల్ పత్రాలు చూపిస్తే సరిపోతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ రవాణాశాఖ డిజిటల్ కార్డులు
AP RTA Citizen : ఏపీలో ఇకపై డ్రైవింగ్ లైలెన్సులు, ఆర్టీసీ కార్డులు ఉండవు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖకు సంబంధించిన యాప్ లో పత్రాలు డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుందని, ఇకపై కార్డులు జారీచేయమని ఈ శాఖ కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకూ లైసెన్సులు, ఆర్సీలను కార్డుల రూపంలో ఇస్తుంది రవాణా శాఖ ఇందుకోసం పోస్టల్ సర్వీస్ తో కలిసి రూ.225 వసూలు చేసేది. అయితే ఇప్పుడు ఈ ఛార్జీలు వసూలు చేయడంలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి త్వరలో కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం "వాహన్ పరివార్" పేరు సేవలన్నీ ఆన్‌లైన్ చేసింది. దీంతో చాలా రాష్ట్రాలు కార్డులను తొలగించి డిజిటల్ రూపంలోనే పత్రాలు జారీ చేస్తున్నాయి. ఈ విధానాన్నే ఏపీ రవాణాశాఖ కూడా అమల్లోకి తెచ్చింది.
ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు?
రవాణాశాఖ వెబ్‌సైట్ https://aprtacitizen.epragathi.org లోని ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ ను తీసుకోవాలి. లేదా "aprtacitizen" ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహన తనిఖీ సమయంలో పోలీసు, రవాణాశాఖ అధికారులకు ఈ పత్రాలు చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ పత్రాలను అనుమతించాలని పోలీసు, రవాణా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరివాహన్ సేవ
డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను నిలిపివేయాలని డిజిటల్‌గా మార్చాలని ఏపీ రవాణా శాఖ నిర్ణయించింది. సీఎం జగన్ ఆదేశాలతో పేపర్‌లెస్ ప్రక్రియలో భాగంగా రవాణాశాఖ డిపార్ట్‌మెంట్ పత్రాలను డిజిటల్ వెర్షన్‌తో భర్తీ చేయనుంది. కార్డుల దరఖాస్తు రుసుము రూ. 200, పోస్టల్ ఛార్జీలు రూ. 25 ఇకపై వసూలు చేయమని ప్రకటించింది. డిజిటల్ కార్డులు డిజిలాకర్ లేదా పరివాహన్ సేవ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్లు ఉపయోగించని వారు డిజిటల్ కార్డులను ప్రింట్ అవుట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవచ్చని రవాణాశాఖ కమిషనర్ పేర్కొన్నారు.
డిజిటల్ పత్రాలు ఉంటే చాలు
ఇకపై ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను క్యారీ చేయక్కర్లేదని, పేపర్ డ్రైవింగ్ లైసెన్స్ లు, పేపర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లకు ప్లాస్టిక్ కార్డులుండవని రవాణా శాఖ తెలిపింది. పేపర్ లెస్ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్ లు, డిజిటల్ ఆర్సీ కార్డులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధానానికి ఏపీ రవాణా శాఖ కూడా అనుమతితెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికి డిజిటల్ కార్డుల జారీ విధానాన్ని అమలుచేస్తుంది. డిజిటలైజేషన్ లో భాగంగా ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆ కార్డుల కొరతతో ఏడాదిగా పెండింగ్ లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీ కార్డుల ప్రింటింగ్ కు ప్రభుత్వం ఇటీవల రూ.33.39 కోట్లు మంజూరు చేసింది.