AP New Cabinet | వైసీపీలో అసమ్మతి సెగలు.. బాలినేని అలక.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన పిన్నెల్లి
10 April 2022, 18:24 IST
- ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారా అనే దానికి తెరపడింది. కేబినెట్ విస్తరణ పూర్తైంది. పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీలో అసమ్మతి సెగ మెుదలైంది. మంత్రివర్గంలో తాము లేకపోయేసరికి పలువురు నేతలు.. డైరెక్ట్ గానే అసమ్మతిని తెలుపుతున్నారు. బుజ్జగించే ప్రయత్నం చేసినా... ఆగడం లేదు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఫైల్ ఫొటో)
మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో అగ్గిరాజేసినట్టైంది. తమకు మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నవాళ్లు.. ఇప్పుడు అలకతో ఉన్నారు. ఇప్పటికే 25మంది పేర్లతో కొత్తమంత్రివర్గం లిస్ట్ బయటకు వచ్చింది. దీంతో .. పదవి ఆశించి.. రానివారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‍రెడ్డి అలకపై సీఎం జగన్ కూడా.. సజ్జలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. బాలినేని ఇంటికి వెళ్ళి బుజ్జగించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ఆదేశించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ఈ విషయాన్ని ఇంకా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కాసేపు ఆయన స్పృహ తప్పిపడిపోయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణరెడ్డి వెళ్లారు. మంత్రి పదవి దక్కకపోవడంపై.. బుజ్జగిస్తున్నారని సమాచారం. అయితే జిల్లా పరిస్థితులు దృష్టిలో ఉంచుకోవాలని ఘాటుగా హెచ్చరించారు బాలినేని. మరోవైపు బాలినేని ఇంటికి వైసీపీ నాయకులు బారులు తీరుతున్నారు. బాలినేనిని బుజ్జగించే పనిలో సజ్జలకు తోడయ్యారు సామినేని ఉదయభాను
ఒక్క బాలినేనే కాదు.. ఇతర నేతలు సైతం తమకు మంత్రి పదవి రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అధిష్ఠానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీలో అసమ్మతి స్వరాలు మెుదలయ్యాయి. తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై కోటంరెడ్డి శ్రీధర్‍రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాకాణిని వైసీపీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగానే కామెంట్లు చేశారట. తీవ్ర అసంతృప్తితో క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించలేదని సన్నిహితుల దగ్గర చెప్పారు. రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం కూడా వాయిదా వేశారు.
మరోవైపు మాచర్ల, చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు మెుదలయ్యాయి. పిన్నెల్లి పేరు లేదంటూ ఆయన అనుచరులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. విడుదల రజనీకి మంత్రి పదవి ఇవ్వడంపై.. ఆమె వ్యతిరేక వర్గం గరంగరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వచ్చింది. సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి చేశారు. 'మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్' అంటూ పిన్నెల్లి ఫోన్ పెట్టిసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.
టాపిక్