AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్, నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు
05 November 2024, 6:50 IST
- AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్… మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది.16వేలకు పైగా పోస్టులతో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
రేపు ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. గత జులైలోనే డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్ నిర్వహణ కోసం దానిని వాయిదా వేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఒకే ఏడాదిలో రెండో సారి టెట్ పరీక్షను నిర్వహించారు. సోమవారం టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించారు. రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు డీఎస్సీ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
డిఎస్సీ నియామకాలకు సంబంధించి మెగా డీఎస్సీ-2024 ఉద్యోగ నియామక ప్రకటన నవంబర్ 6న విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రివగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డీఎస్సీ నియామకాల ఫైలుపై తొలి సంతకం చేశారు.
పోస్టుల సంఖ్య పెరగడంతో డీఎస్సీకి సిద్ధమయ్యేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో పాటు రెండోసారి టెట్ నిర్వహించారు. టెట్ ఫలితాలు కూడా విడుదల కావడంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధ మైంది.
6న నోటిఫికేషన్, ఫిబ్రవరిలో పరీక్షలు…
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు 6,100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షలు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సీ నిర్వహణపై కసరత్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీల ఆదారంగా 16,347 పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు.నవంబర్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. 2024 డిసెంబరు 6 వరకు నెల రోజులపాటు దరఖాస్తుల స్వీకరిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
జిల్లా మొత్తానికి ఒకే రోజు పరీక్ష?
డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్‌లో నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పలు విడ తలుగా పరీక్షలు చేపట్టనున్నారు. ఎస్జీటీ పోస్టులకు సంబంధించి పరీక్షల నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. గతంలో పరీక్షల ఫలితాలను నార్మ లైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి పేపర్ తేలిగ్గా వచ్చిందని కొందరికి క్లిష్టంగా వచ్చిందనే విమరశలు వస్తున్నాయి.
డిఎస్సీ పరీక్షల నిర్వహణలో రెండు, మూడు జిల్లాల అభ్యర్థులకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహించడంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఈ విధానంలో రెండు, మూడు రోజుల్లోనే అన్ని జిల్లాల్లోనూ పూర్తిగా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఇదే విధానాన్ని అమలు చేశారు. నార్మలై జేషన్ లేకుండా ఫలితాలు విడుదల చేశారు. ఏపీలో కూడా అదే పద్ధతి అమలు చేయాలని యోచిస్తున్నారు.
డిఎస్సీలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఇలా…
డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.