Akshayapatra Donations: సర్కారీ స్కూల్ విద్యార్థుల చిత్రాలతో విరాళాల సేకరణ, చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం
25 September 2024, 13:28 IST
- Akshayapatra Donations: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల చిత్రాలతో మధ్యాహ్న భోజనానికి విరాళాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుండగా, విరాళాల వసూలు వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
పాఠశాల విద్యార్థుల చిత్రాలతో విరాళాల కోసం ప్రకటనలు
Akshayapatra Donations: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. గతంలో పాఠశాలల్లో వంట చేయడానికి మిడ్ డే మీల్ వర్కర్లు ఉండేవారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం ఆహారాన్ని అందించే బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించారు.
ఆ సంస్థకు ఉన్న సెంట్రలైజ్డ్ కిచెన్లలో వండిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలకు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాగిజావను విద్యార్థులకు ఈ సంస్థ అందిస్తోంది,. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్వహణను కూడా అక్షయపాత్రకు అప్పగించారు.
తాజాగా పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి విరాళాలు అందించాలని కోరుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వెలుగు చూసింది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే యూనిఫాంలు ధరించిన విద్యార్థుల చిత్రాలతో విరాళాలు అభ్యర్థిస్తూ ప్రకటనలు కనిపించాయి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అక్షయపాత్ర సంస్థ పాఠశాల విద్యార్థుల చిత్రాలతో మధ్యాహ్న భోజన పథకానికి విరాళాలివ్వాలని ఆన్లైన్‌లో ప్రచారం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నారు. వాటిలో నాణ్యతా ప్రమాణాల కోసం అదనపు నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్లలో తయారైన ఆహారాన్ని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పాత పద్ధతుల్లోనే మిడ్ డే మీల్ వర్కర్ల ద్వారా స్కూళ్లలో వండించి అందిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పథకం అమలు చేస్తుంటే అక్షయపాత్ర నేరుగా విరాళాలు కావాలని అభ్యర్థించడంపై విద్యాశాఖ కూడా స్పందించింది. దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయ వర్గాలు కూడా ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారుల వివరణ కోరారు.