Toddy Policy 2022-27 : కల్లు గీత కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
01 November 2022, 17:24 IST
- Kallu Geetha Karmikulu : కల్లుగీత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చింది. 2022 నుంచి 2027 కాలానికి కల్లు గీత పాలసీ, కొత్త మార్గ దర్శకాలు విడుదల అయ్యాయి.
కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్
కల్లుగీత కార్మికులకు జగన్ ప్రభుత్వం(Jagan Govt) కొత్తపాలసీని తీసుకొచ్చింది. ఏపీలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకురేలా ఈ పాలసీ ఉంది. కల్లు రెంటల్స్(Toddy Rentals)ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్ కూడా ఇవ్వనున్నారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే, చనిపోయిన కల్లుగీత కార్మికుల కుటుంబీకులకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ఏపీ ప్రభుత్వం(AP Govt) రెట్టింపు చేసింది. కల్లుగీత కార్మికుల కోసం.. 2022-27 కోసం కొత్త పాలసీని తీసుకొచ్చారు. రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ కొత్త మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. లైసెన్స్ వ్యవధి ఐదు సంవత్సరాలు, సెప్టెంబర్ 30, 2027న ముగుస్తుంది.
ఎవరైనా కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ(Training) ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపిస్తారు. వైఎస్సార్ బీమా(YSR Bima) ద్వారా నష్టపరిహారం కూడా చెల్లిస్తారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత వంటి చెట్లను పెంపకానికి చర్యలు తీసుకుంటారు. కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచుతారు.
కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ షాపు ప్రాంతం నుండి 100 కి.మీ లోపు అవసరం, పబ్లిక్ ఆర్డర్, ట్రోప్‌లలో ఎక్సైజ్ చెట్ల లభ్యతను పరిగణనలోకి తీసుకుని కల్లు దుకాణాల సంఖ్యను నిర్ణయిస్తారు. పేద కల్లుగీత కార్మికుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో చెట్టుకు రూ. 25, పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ. 50 వసూళ్ల సేకరణ రద్దు చేస్తారు.
చనిపోయిన కల్లుగీత కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. బాధిత కుటుంబానికి కార్మిక శాఖ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో చెల్లిస్తుంది. ఈ పథకానికి 'YSR గీతకార్మిక భరోసా'(YSR Geetha Karmika Bharosa) కింద ఇస్తారు. సహజ మరణం సంభవించినట్లయితే, మరణించిన కల్లూగీత కార్మికుడి వారసుడికి YSR భీమా కింద ప్రయోజనాలు అందుతాయి.