తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood Insurance: పదిరోజుల్లో వాహనాలకు బీమా చెల్లించేలా ఏపీ సర్కారు ప్రయత్నాలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు

Flood Insurance: పదిరోజుల్లో వాహనాలకు బీమా చెల్లించేలా ఏపీ సర్కారు ప్రయత్నాలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు

06 September 2024, 9:49 IST

google News
    • Flood Insurance:  విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరదలతో వేల సంఖ్యలో  వాహనాలు నీట మునిగాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో బాధితుల్ని ఆదుకోడానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపారు. ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ప్రజల్ని త్వరగా ఆదుకోవాలని సూచించారు. 
ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు
ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు

ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు

Flood Insurance: బుడమేరు వరదలు బెజవాడ నగరానన్ి ముంచెత్తడంతో విజయవాడలో వేలాది వాహనాలు వరద ముంపుకు గురయ్యాయి. వాహనాలను మళ్లీ వినియోగించే పరిస్థితులు లేకపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరిపారు. 10 రోజుల్లోనే వాహ‌నాల‌కు బీమా మొత్తం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు.

ఇన్సూరెన్సు లేని వాహ‌నాల‌కు ఏ విధంగా సాయం చేయాలో చూస్తున్నామని చెప్పారు. దెబ్బ‌తిన్న వ్యాపారులను కూడా ఆదుకుంటామని ప్రకటించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలావ‌ర‌కు వాహ‌నాలు దెబ్బ‌తిన్నాయి. కొన్ని వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉందని, మ‌రికొన్ని వాహ‌నాల‌కు ఇన్సూరెన్సు లేదని వీటిని విశ్లేషించి రెండు కేట‌గిరీలుగా విభ‌జించనున్నట్లు చెప్పారు.

మొద‌ట ప‌ది రోజుల్లోగా పాడైన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించ‌డాన్ని ప్ర‌ధాన బాధ్య‌త‌గా పెట్టుకున్నట్టు చెప్పారు. రెండోది ఎవ‌రైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకు రుణాలు తెచ్చుకున్న‌వారు, సొంతంగా డ‌బ్బులు పెట్టుకున్న వారు చాలావ‌ర‌కు న‌ష్ట‌పోయారని, ప‌ల్ల‌పు ప్రాంతాల్లో ఉన్న షాపులు బాగా పోయాయని వాటిలో ఉన్న పదార్ధాలు వినియోగించే పరిస్థితి లేదని వారంద‌రికీ ఆస‌రా క‌ల్పించాల్సి ఉందన్నారు.

ముంపు బాధితులందరికీ సాయం…

ముంపుకు గురైన ప్రాంతాల్లో బాధితులందరికీ ఒక ప్యాకేజీ ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బాధితులకు 25 కిలోల బియ్యం, కేజీ ప‌ప్పు, లీట‌ర్ పామాయిల్‌, బంగాళా దుంప‌లు రెండు కిలోలు, ఉల్లి రెండు కిలోలు, చ‌క్కెర కిలో ప్ర‌తి ఒక్క ఇంటికీ ఇస్తామన్నారు. బీపీఎల్‌, ఏపీఎల్ అనే తేడా లేకుండా అంద‌రికీ ఇస్తామని చెప్పారు.

పారిశుద్ధ్య చ‌ర్య‌ల్లో కీల‌కంగా ఫైర్ ఇంజిన్లు..

వరద నీటి తొలగింపులో ఫైర్ ఇంజిన్లు బాగా ప‌నిచేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఒక్కో ఇంజిన్ రోజుకు 250 ఇళ్లు క్లీన్ చేయ‌గ‌లుగుతుందని, రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో ప‌నిచేసేలా చూస్తామన్నారు. రెండుమూడు రోజుల్లో పని పూర్తిచేయాల‌ని చూస్తున్నామన్నారు. పొడి ప్రాంతాల్లో ముందు చేసి త‌ర్వాత నీరు ఉండే ప్రాంతంలో చేస్తామన్నారు. ట్యాంక‌ర్ల‌ను బాగా పెంచుతున్నామని, ఎక్క‌డా నీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.

అందరికి మిన‌ర‌ల్ వాట‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామని బాబు చెప్పారు. బుధవారం రాత్రికే చాలా ప్రాంతాల్లో క‌రెంటు వ‌చ్చిందన్నారు. గురువారం ఉద‌యానికి చాలా వ‌ర‌కు ఇస్తామని, కొద్దిప్రాంతాలు త‌ప్ప మిగిలిన అన్ని ప్రాంతాల‌కు సాయంత్రానికి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రిస్తామన్నారు.

నగరంలో పెద్దఎత్తున చెత్తా చెదారం తొల‌గింపున‌కు వాహ‌నాలు పెట్టామని వివరించారు. ఈ ప్ర‌య‌త్నంలో ఎలాంటి లోపం లేకుండా ఎన్ని విధాలా ఆలోచించాలో అన్ని విధాలా ఆలోచించి సాధార‌ణ స్థితికి ప‌రిస్థితిని తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.

రెండు బుడ‌మేరు గండ్లు పూడ్చాం..

బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డితే వాటిలో రెండు ఇప్ప‌టికే పూడ్చినట్టు చంద్రబాబు చెప్పారు. మంత్రులు నారా లోకేష్‌, రామానాయుడు అక్క‌డే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారని, మిగిలిన గండిని గురువారం ఉద‌యానికి పూర్తిచేస్తామన్నారు.

బుడ‌మేరుకు ఎక్కువ నీళ్లు వ‌స్తున్నాయ‌ని కొంద‌రు వ‌దంతులు వ్యాప్తి చేస్తున్నారని, నీళ్లు ఎక్కువ‌గా రావ‌డం లేదని, నిన్న వ‌చ్చిన నీళ్లే ఉన్నాయని పెద్ద ప్ర‌మాదం లేదని స్పష్టం చేవారు. అనివార్య ప‌రిస్థితుల్లో ఎక్కువ నీరు వ‌స్తే ఏమిచేయాల‌నే దానిపై ఇప్ప‌టి నుంచే ఆలోచిస్తున్నాం. కొల్లేరుకు ఆ నీరు పోవ‌డానికి ఏం చేయాలో చూస్తామన్నారు.

ప్రజల నుంచి భారీగా విరాళాలు…

ప్ర‌జ‌ల నుంచి ప్రభుత్వానికి మ‌ద్ద‌తు వ‌స్తోందని ఇది శుభ ప‌రిణామమని చెప్పారు. సీఎం రిలీఫ్ కు విరాళాలు ఇవ్వ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేయడంతో ఉన్న‌ప‌ళంగా 2,969 మంది స్పందించి విరాళాలు ఇచ్చారని రోజులో 99 ల‌క్ష‌ల 25 వేల 212 రూపాయ‌లు విరాళంగా అందిందన్నారు. వీరిలో వెయ్యిలోపు విరాళాలు అందించిన‌వారు 1,528 మంది కాగా వీరు రూ. 3,28,161 ఇచ్చారని చెప్పారు.

1001-10,000 వ‌ర‌కు 1169 మంది విరాళాలు అందించారు. వీరిద్వారా రూ. 28,09,822 అందింది. ప్ర‌జ‌లుక‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు. నాలుగు రోజులుగా రాత్రింబ‌వ‌ళ్లు తనతో పాటు సీనియ‌ర్ అధికారులంద‌రినీ ఫీల్డ్‌కి పంపించానని సిసోడియా వంటి సీనియ‌ర్ అధికారులు క్షేత్ర‌స్థాయిలో పోటీప‌డి ప‌నిచేశారన్నారు. అల‌వాటు తెచ్చుకొని బుర‌ద‌లో ప‌నిచేసి త‌ద్వారా బాధితుల‌కు సేవ‌లందించారన్నారు.

కొంద‌రు కూర‌గాయ‌లు ధరలు పెంచేస్తున్న‌ట్లు తమ దృష్టికి వ‌చ్చిందని అందుకే కూర‌గాయ‌ల‌కు రెండు రూపాయ‌లు, అయిదు రూపాయ‌లు, ప‌ది రూపాయ‌లు అనే మూడు రేట్ల శ్లాబులు పెట్టామని ఆకు కూర‌ల‌ను రాయితీపై రూ. 2కే ఇస్తామని చెప్పారు. రూ. 10, రూ. 15, రూ. 20 విలువైన కూర‌గాయ‌ల‌ను రూ. 5కే ఇస్తామన్నారు. రూ. 25, రూ. 30 చేసేవాటిని రూ. 10కే ఇస్తామని ఈ మూడు రేట్ల‌కే కూర‌గాయ‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

తదుపరి వ్యాసం