Helicopters For Jagan: ముఖ్యమంత్రి జగన్ కోసం రెండు హెలికాఫ్టర్లు.. లీజుకు తీసుకోనున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం
23 February 2024, 9:03 IST
- Helicopters For Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం రెండు హెలికాఫ్టర్లను లీజుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం కొత్తగా రెండు హెలికాఫ్టర్లు
Helicopters For Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంAP Govt నిర్ణయించింది. లీజు ప్రాతిపదికన గ్లోబర్ వెక్ట్రా సంస్థ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు.
కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లను విజయవాడ, విశాఖలో ఉంచాలని నిర్ణయించారు. 2 ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లు లీజు Leaseకు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్లు లీజు చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ AP Aviation Corporation ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో కొత్త వాటిని సమకూర్చుకోవాలని నిర్ణయించారు.
మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌కు సంఘవిద్రోహుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీInteligence DG నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం సిఎం జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున సిఎంకు ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో కొత్త హెలికాఫ్టర్లను సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ 2010 నుంచి వినియోగంలో ఉన్నందున దానిని మార్చాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ప్రోటోకాల్ సిఫారసులతో సీఎం ప్రయాణాలకు హెలికాప్టర్లు సమకూర్చాలని నిర్ణయించారు. హెలికాప్టర్లతోపాటు ఇతర ఖర్చులనూ చెల్లించేలా ఒప్పందం చేసుకోవాలని మౌలిక వసతులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా సమకూర్చుకునే హెలికాఫ్టర్లను ఒకటి విజయవాడలోని గన్నవరం Vijayawada విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం Visakhapatnam విమానాశ్రయంలో అందుబాటులో ఉంచుతారు.
ఒక్కో హెలికాఫ్టర్‌కు రూ.1,91,75,000 చొప్పున రెండింటికీ కలిపి నెలకు రూ.3,83,50,000 అద్దె చెల్లించనున్నారు. అద్దెతో పాటు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటళ్లలో బస, పైలట్లు, సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు, ఇంధన రవాణా ఛార్జీలు, హెలికాప్టర్ సిబ్బంది మెడికల్ ఖర్చులు, ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించనున్నారు.
ముప్పుతోనే హెలికాఫ్టర్లు…
'ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారని, ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు, అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్ 2010 నుంచి బెల్ 412 వీటీ-ఎంఆర్‌వీ ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగిస్తున్నారని, హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పర్యటనలు పెరగటం, దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న హెలికాప్టర్ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది' అంటూ నిఘా విభాగం డీజీపీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి ఈ రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది. సీఎంతో పాటు ఇతర వీవీఐపీల పర్యటనలకూ వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం కోసమేనా…?
ఫిబ్రవరి నెలాఖర్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కోసం హెలికాఫ్టర్లను సిద్ధం చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం సిఎం జగన్ పర్యటనల కోసం వినియోగించుకునేందుకు కొత్త హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఒకేసారి రెండు హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.