తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Primary Health : ప్రాథమిక ఆరోగ్య రంగంపై భారీ ఖర్చు….అయినా నిరుపయోగం…!

Primary Health : ప్రాథమిక ఆరోగ్య రంగంపై భారీ ఖర్చు….అయినా నిరుపయోగం…!

HT Telugu Desk HT Telugu

09 August 2022, 10:48 IST

google News
    • ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక ఆరోగ్యం రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వైఎస్సార్‌ హెల్త్ క్లినిక్స్‌,  ‍అర్బన్‌  హెల్త్ సెంటర్స్‌, ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో ప్రాథమిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా  ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతుండటంతొో  ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  
ప్రాథమిక ఆరోగ్యంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
ప్రాథమిక ఆరోగ్యంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

ప్రాథమిక ఆరోగ్యంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. ప్రాథ‌మిక వైద్య విభాగంలో మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.2532 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది చివరికి అన్ని ప్రాంతాల్లో నూత‌న భ‌వ‌నాలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానానికి కీల‌కం కొత్త భ‌వ‌నాలు కీలకం కానుండటంతో గ‌డువులోగా భ‌వ‌నాల నిర్మాణం పూర్త‌ి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

దేశంలోనే తొలిసారి ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమ‌ల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఇది స‌రికొత్త ప్రయోగంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు, ప్రాథ‌మిక వైద్య‌శాల‌ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ‌్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.

పేద ప్ర‌జ‌లంద‌రికీ ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రతి గ్రామ‌ంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల‌ను నిర్మిస్తున్నారు. రూ.1500 కోట్ల‌తో 1032 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం చేప‌ట్టారు. 184 యూహెచ్‌సీల ఆధునికీక‌ర‌ణ‌, 344 కొత్త యూహెచ్‌సీల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం రూ.665 కోట్లు కేటాయించింది. ఈ పనులు దాదాపు పూర్తికావ‌చ్చాయి. 976 పీహెచ్‌సీల ఆధునికీక‌ర‌ణ‌, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.367 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం ఈ ఏడాది చివ‌రి క‌ల్లా పూర్తి కావాల‌ని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భ‌వనాల నిర్మాణం కోసం బిల్లుల చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని ప్రభుత్వం చెబుతోంది.

భిన్నంగా క్షేత్ర స్థాయి పరిస్థితులు….

ఏపీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం వైద్య సేవల నుంచి కాంట్రాక్టు సంస్థ తప్పుకుంది. ఆ తర్వాత ప్రభుత్వమే వైద్యులతో పాటు ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టాలని భావించింది. ఇందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికి అది పూర్తి కాలేదు. ఫలితంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వాస్పత్రులు, బోధనాసుపత్రులకు వెళ్ళాల్సి వస్తోంది. గతంలో టెలిమెడిసిన్ పేరుతో కాంట్రాక్టు సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలతో కాంట్రాక్టులు రద్దు చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో జరిగే వైద్య పరీక్షలు కూడా నిలిచిపోయాయి. మలేరియా జ్వరాలకు తప్ప మరో పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. రేపుమాపని ప్రకటనలు తప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, వైద్యులు లేరనే విమర్శ వినిపిస్తోంది.

తదుపరి వ్యాసం