Supreme Court : రాజధాని తీర్పులపై సుప్రీం కోర్టు స్టే….సర్కారుకు పాక్షిక విజయం
28 November 2022, 14:13 IST
- Supreme Court అమరావతి రాజధాని వ్యవహారంలో హై కోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజధాని వ్యవహారంలో గత మార్చిలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు అంశాలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాక్షికంగా ఉపశమనం లభించినట్లైంది.
అమరావతి రాజధాని విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి పాక్షిక ఊరట
Supreme Court అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ హైకోర్టు గత మార్చి 3న ఇచ్చిన తీర్పులో పలు అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆర్నెల్ల లోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను వచ్చే ఏడాది జనవరి 31కు వాయిదా వేసింది.
రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే లభించింది. ఆరు నెలల్లో రాజధానిని పూర్తి చేయాలనడం సరికాదని అభిప్రాయపడింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు, హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని నిలదీసింది.
హైకోర్టు ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తే అక్కడ కేబినెట్ ఎందుకని ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా అని సుప్రీం నిలదీసింది. అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని - హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేమంది. ప్రతివాదులకు నోటీసులు, తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.
ఏ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని, హైకోర్టులు నిర్ణయించలేవని సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. మార్చి 3న ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై దాకలైన స్పెషల్ లీవ్ పిటిషన్స్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రాజధాని విషయంలో శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య తలెత్తిన ఘర్షణ వైఖరిపై వాడీవేడిగా వాదనలు జరిగాయి.
ఏడు అంశాల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మొదటి రెండు అంశాలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. ల్యాండ్ పులింగ్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెబుతూనే నిర్ణీత వ్యవధిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ఆదేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చారు. శాసనసభకు అధికారం లేదనే ఆదేశాలపై ప్రభుత్వ న్యాయవాదులు విస్తృతంగా వాదనలు వినిపించారు.ఇదే విషయంలో దాఖలైన మొత్తం 72కేసుల్లో ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.