తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees : మళ్లీ ఉద్యమబాట పట్టిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, మే 22 నుంచి కార్యాచరణ

AP Govt Employees : మళ్లీ ఉద్యమబాట పట్టిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, మే 22 నుంచి కార్యాచరణ

20 May 2023, 14:11 IST

google News
    • AP Govt Employees : మళ్లీ ఎన్నికలు వస్తున్నా పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. పీఆర్సీ సహా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మే 22 నుంచి ఉద్యమబాట పడుతున్నట్లు స్పష్టం చేశారు.
 ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని కార్యదర్శి జి.ఆస్కార్ రావు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని కార్యదర్శి జి.ఆస్కార్ రావు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని కార్యదర్శి జి.ఆస్కార్ రావు

AP Govt Employees : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కానీ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని కార్యదర్శి జి.ఆస్కార్ రావు అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వారు దాచుకున్న సొమ్ము ప్రభుత్వం వాడేసుకోడం ఏమిటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చిందన్నారు. ఈ నెల 22 నుంచి ఈ కార్యాచరణ మొదలు అవుతుందని ఆస్కార్ రావు స్పష్టం చేశారు.

మే 22 నుంచి ఉద్యమబాట

అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపు ఇచ్చామని ఆస్కార్ రావు తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సహా వేర్వేరు శాఖల ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణలో పాలుపంచుకుంటారన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు బదిలీలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఇక సమ్మెకు దిగడం మినహా మాకు మరో గత్యంతరం కనిపించడం లేదని తెలిపారు. మే 22 నుంచి ఉద్యోగులంతా ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు ఆస్కార్ రావు.

అక్టోబర్ 31న చలో విజయవాడ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇటీవల రాజమండ్రిలో సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 22న అన్ని తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలతో నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. జూన్ నెలలో బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు ఇస్తామన్నారు. జులై 5, 6 తేదీలలో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మొదలుపెట్టి అక్టోబరు నెలాఖరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ ప్రదర్శనలు చేపడతామని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగులతో ఆటలాడుతుందని మండిపడ్డారు. అక్టోబరు 31 న చలో విజయవాడకు పిలుపునిస్తామన్నారు.

ఉద్యోగులను తీవ్రవాదులుగా చూస్తున్నారు

ప్రతినెలా రావాల్సిన పింఛన్, జీతం కూడా ఉద్యోగులకు ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం బాకీ పడ్డ 20 వేల కోట్లు రాత్రికి రాత్రి ఇవ్వమనడం లేదన్నారు. వేల కోట్లు రూపాయలు పెండింగ్ లు పెట్టేసి చేతులెత్తేసే ఎలా అని, ఒక నిర్దిష్టమైన కాలపరిమితిలో చెల్లిస్తామని ఒక చట్టాన్ని చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గతంలో గవర్నర్ కలిసినట్లు చెప్పారు. ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ వ్యవహారాలు గవర్నర్ నియంత్రణలోనే ఉండాలని కోరామన్నారు. గవర్నర్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వాళ్లను తీవ్రవాదులుగా చూస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దాడిచేస్తుందన్నారు. ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం