PM Kisan Raitu Bharosa : నేడు పిఎం కిసాన్… రైతు భరోసా నిధులు
17 October 2022, 8:15 IST
- PM Kisan Raitu Bharosa ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తోన్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. రాష్ట్రంలో 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్లను విడుదల చేయనున్నారు.
నేడు పిఎం కిసాన్ రైతు భరోసా నిధుల విడుదల
PM Kisan Raitu Bharosa ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు నంధ్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగో విడత పిఎం కిసాన్- రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. సీఎం జగన్ ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 నుంచి 12.10 వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఏపీలో రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రైతన్నలకు రూ.25,971.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు.
PM Kisan Raitu Bharosa రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందచేయనుంది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు రూ.7,000 కోట్లను రైతు భరోసా ద్వారా అందచేస్తున్నారు.
రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది.
తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూర్చినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతు భరోసాతో ఇప్పటి దాకా బీసీలలో 24,61,000 మందికి రూ.12,113.11 కోట్లు, ఎస్సీలలో 5,23,000 మందికి రూ.2,653.04 కోట్లు, ఎస్టీలలో 3,92,000 మందికి రూ.1,771.13 కోట్లు, మైనార్టీలు 60,000 మందికి రూ.320.68 కోట్లు, కాపులలో 7,85,700 మందికి రూ.3,793.44 కోట్లు, ఇతరుల్లో 10,16,300 మందికి రూ.5,319.93 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 52,38,000 మంది రైతులకు రూ.25,971.33 కోట్లు విడుదల చేశారు.