తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Family Doctor : మార్చి 1 నుంచి పూర్తి స్థాయిలో "ఫ్యామిలీ డాక్టర్".. సీఎం జగన్

AP Family Doctor : మార్చి 1 నుంచి పూర్తి స్థాయిలో "ఫ్యామిలీ డాక్టర్".. సీఎం జగన్

HT Telugu Desk HT Telugu

27 January 2023, 21:00 IST

google News
    • AP Family Doctor : మార్చి 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ ని పూర్తిస్థాయలో అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభం కావాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ కూడా మార్చి 1 నుంచి ప్రారంభం కావాలని ఆదేశించారు.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

AP Family Doctor : ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు... రాష్ట్ర సర్కార్ మరో కీలక ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అమలు చేస్తోన్న ప్రభుత్వం... ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా.. అద్భుత ఫలితాలు వస్తోన్న నేపథ్యంలో... మార్చి 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని... ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా అధికారులు.. సీఎం జగన్ కు వివరించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని... జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న పరికరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని... కొత్తగా అవసరమైన వాటిని వీలైనంత త్వరగా తెప్పించి... ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచే గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా విలేజ్ క్లినిక్స్ లో 24 గంటలపాటు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. మెుత్తం ఏపీలో 100032 వైఎస్సార్‌ విలేజ్ హెల్త్ క్లినిక్‌ ల ఏర్పాటుతో క్లినిక్ పరిధిలో 2 వేల మందికి వైద్య సేవలు అందిస్తారు. వీటిలో 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా వైద్యాధికారి, మిగిలిన టీమ్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు నెలలో రెండు సార్లు వెళ్తారు. వైద్యంతోపాటుగా ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన కల్పిస్తారు. ఈ పథకం కింద 6,313 సబ్ సెంటర్స్, 3,719 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేశారు. ప్రతి 5 వేలమంది జనాభాకు హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

ప్రతి పౌరుడి ఇంటి వద్దకు వెళ్లి.. పరీక్షలు చేస్తారు. వారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తారు. ప్రతి పౌరుడి వివరాలు , వారి అనుమతి తీసుకొని, డిజిటలైజ్ చేస్తారు. ఈ మేరకు డిజిటల్ హెల్త్ ఐడీ క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ దేశంలోనే ఇదే తొలిసారి. ఆరోగ్యశ్రీ, ఎన్‌సిడి స్క్రీనింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌ను ఏకీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అవసరం అనుకుంటే... ఎన్ సీడీ కేసులకు ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు.

తదుపరి వ్యాసం