AP Bogus Votes Issue : దిల్లీ చేరిన ఏపీ ఓట్ల తొలగింపు వ్యవహారం-టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫిర్యాదులు
28 August 2023, 18:18 IST
- AP Bogus Votes Issue : ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ, వైసీపీ దిల్లీలో పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నాయి. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించారని చంద్రబాబు, బోగస్ ఓట్లు మాత్రమే తొలగించామని విజయసాయిరెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు, విజయసాయి రెడ్డి
AP Bogus Votes Issue : ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దిల్లీకి చేరింది. ఓట్ల తొలగింపుపై వైసీపీ, టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీ ఫిర్యాదులు చేశారు. దిల్లీలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఈసీ ఉన్నతాధికారులతో గంటపాటు భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని చంద్రబాబు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో వైసీపీ నేతలు చెప్పినట్లు ఓట్లు తొలగించారని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్లా జరిగాయని చంద్రబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలనే దుర్మార్గపు అలోచన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి రాలేదన్నారు. ఓట్ల తొలగింపులో వైసీపీ చేసిన దారుణాలను సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని చంద్రబాబు అన్నారు. తనపై దాడిచేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లను భారీగా తొలగించారని చంద్రబాబు ఆరోపించారు.
టీడీపీ హయాంలోనే బోగస్ ఓట్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సీఈసీని ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో భారీగా నకిలీ ఓటర్లను చేర్చారని, వాటిని ఇప్పుడు తొలగించామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న విజయసాయి రెడ్డి... అవి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్రమంగా చేర్చారని ఆరోపించారు. 2019లో ఎన్నికలకు ముందు ఏపీలో 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఓ లక్ష ఎక్కువే ఓటర్లు ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలోనే భారీగా నకిలీ ఓట్లు చేర్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తుందని ఈసీకి వివరించామని విజయసాయి అన్నారు.
ఒలింపిక్స్ లో ఆ పోటీ ఉంటే చంద్రబాబుకే ఫస్ట్ ప్లేస్
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓట్లను ఎలా మార్చారో పూర్తి వివరాలను ఈసీకి అందించామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు బాధంతా ఆధార్ కార్డుకు ఓటర్ కార్డును లింక్ చేశారనే అని విమర్శించారు. వ్యక్తి చనిపోయిన వెంటనే ఆధార్ కార్డు పనిచేయదని, అనంతరం ఓటర్ కార్డు కూడా పనిచేయదన్నారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీలు పెడితే చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నమోదు చేయించిన బోగస్ ఓట్లన్నింటిని తాము తొలగిస్తామనే భయంతో ఇప్పుడు చంద్రబాబు కంగారుగా సీఈసీని కలిసి ఫిర్యాదు చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 2015 నుంచి ఉన్న దొంగ ఓట్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందించామని తెలిపారు.