Kanna Targets Somu : సోము వీర్రాజు వల్లే వెళ్లిపోతున్నా…. కన్నా
16 February 2023, 12:42 IST
- Kanna Targets Somu బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పద్ధతి బాగోకపోవడం వల్లే బీజేపీని వీడుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. 2014లో మోదీ నాయకత్వం నచ్చడంతో బీజేపీలో చేరానని ఆ పార్టీలో కొనసాగానని,సోము వీర్రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉండటం వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ
Kanna Targets Somu ఏపీ బీజేపీలో నెలకొన్న పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర నాయకత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే విషయంలో సోము వీర్రాజు వ్యవహార శైలి నచ్చకపోవడం వల్ల పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. కేవలం సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వం మీద ఆకర్షణతో బీజేపీలో చేరి పార్టీలో కొనసాగినట్లు కన్నా చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో పని చేశానని, 2018లో బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని, 2019 ఎన్నికలకు కేవలం 10నెలలముందు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని చెప్పారు.
తనను అధ్యక్షుడిగా ప్రకటించిన పది నెలల్లో 175 నియోజక వర్గాల్లో పర్యటించి, 2019 ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడంతోనే సమయం సరిపోయిందని చెప్పారు.
2019 తర్వాత బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి కష్టపడినట్లు కన్నా చెప్పారు. 2024 ఎన్నికలకు అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేసినట్లు చెప్పారు. 2019 తర్వాత పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అన్ని పార్టీల బీజేపీలో చేరారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారని కన్నా గుర్తు చేశారు.
2024నాటికి బీజేపీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో ఎంతోమంది పార్టీలో చేరారని, వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత, అజ్ఞాన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తన పోరాటం కొనసాగించినట్లు చెప్పారు. అమరావతి రాజధాని మార్పుపై పెద్ద ఎత్తున పోరాడినట్లు గుర్తుచేశారు.
కోవిడ్ తర్వాత తన స్థానంలో సోము వీర్రాజును అధ్యక్షుడిని చేశారని, సోము వీర్రాజు కక్ష సాధింపుతో పనిచేశారని కన్నా ఆరోపించారు. తనకు మోదీ మీద అభిమానం జీవిత కాలం ఉంటుందని, రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిస్థితులు చూసి పార్టీలో ఇమడలేక బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కన్నాతో పాటు పలువురు నాయకులు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు.
మరోవైపు ఎంపీ జివిఎల్ నరసింహరావు వైఖరిపై కన్నా మండిపడ్డారు. ఒక్క రాత్రిలో నాయకుడు కావాలనుకున్న వారికి కాపుల్ని బీసీల్లో చేర్చడంతో పాటు రంగా వర్ధంతులు, విగ్రహాలు పెట్టుకోవడం చేస్తారని ఎద్దేవా చేశారు. కాపుల విషయంలో ఎవరి సమయంలో ఏమి జరిగిందో మాత్రమే తాను వివరించానని, దానిని ఎవరు ఖండించలేకపోయారన్నారు. ఎవరు అధికారంలో ఉండగా కాపులకు ఎక్కువ మేలు జరిగిందో చెబితే ఎందుకు మిగిలిన వారు ఖండించలేకపోయారన్నారు.
కాపుల విషయంలో పార్టీలో చర్చించి, పార్టీ తరపున చేయాల్సిన పనుల్ని , వ్యక్తిగతంగా ఎందుకు చేపడుతున్నాడో జివిఎల్ సమాధానం చెప్పాలన్నారు. పార్టీ వైఖరి చెప్పకుండా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నాడో జివిఎల్ వెల్లడించాల్సి ఉందన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి జివిఎల్ ఇవన్నీ మాట్లాడుతున్నాడో అందరికి అర్ధం అవుతాయన్నారు. కాపుల కోసం ఉద్యమం జరిగిన సమయంలో ఆ ఉద్యమంలో ఆయన ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు.
సోము వీర్రాజు పద్ధతి లేకపోవడం వల్లే తాను పార్టీని వీడుతున్నానని కన్నా స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని కన్నా చెప్పారు. 40ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశానని, పదవి ఆశించి ఎప్పుడు పనిచేయలేదని, ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా ఎప్పుడు పదవి కావాలని తాను వెళ్లి ఎప్పుడూ అడగలేదన్నారు. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు.