AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా
21 September 2023, 15:10 IST
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముట్టడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వాయిదా తీర్మానంపై నోటీసులిచ్చారు.
బావ కళ్లలో ఆనందం కోసం బాలయ్య మీసాలు మెలేశారు- మంత్రి రోజా
బావ కళ్లలో ఆనందం కోసం బాలయ్య మీసాలు మెలేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తించారన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఖండించిన సీపీఐ రామకృష్ణ
ఏపీ అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. చంద్రబాబు అరెస్టుపై చర్చలో చేపట్టాలని కోరితే సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాలకు వైసీపీ ప్రభుత్వం విలువ ఇవ్వడంలేదన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు శాసనమండలిలో ఛైర్మన్ పోడియం వద్ద టీడీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నినాదాలు చేశారు. సభా మర్యాద పాటించాలని ఛైర్మన్ టీడీపీ సభ్యులకు సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో శాసనసమండలి రెండోసారి వాయిదా పడింది.
రేపటికి వాయిదా పడిన ఏపీఅసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.
నా వృత్తిని అవమానించారన్న బాలకృష్ణ
అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో చంద్రబాబు ఎంతో ఆత్మవిశ్వాసం నింపారని, ఆధారాలు లేని కేసులో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని, సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. సభలో నాకొక్కడికే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారన్నారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడకొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలేనని నేను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారని, ప్రజలే వారికి త్వరలో బుద్ది చెప్తారన్నారు. నా వృత్తిని అంబటి రాంబాబు అవమానించాడని, నా వృత్తి నాకు అమ్మ లాంటిదన్నారు. అంబటికి కౌంటర్ గా నేను తొడకొట్టి, మీసం మెలితిప్పానని నేను ఎవరికీ భయపడనని చెప్పారు. భయపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నాడని, నేను రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు.
17మంది ఎమ్మెల్యేలకు 200 మార్షల్స్
17మంది టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి 200మంది మార్షల్స్‌ను ఉపయోగించి శాసనసభ నడపాలని ప్రభుత్వం భావిస్తోందని అచ్చన్నాయుడు ఆరోపించారు.
సంబంధం లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు.
శాసనసభ చరిత్రలో దుర్దినం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు విమర్శించారు. చంద్రబాబుకు సంబంధం లేని విషయంపై అక్రమ కేసు పెట్టారని, టీడీపీ ఏకైక నినాదం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని, బాలకృష్ణ ముందుగా రెచ్చగొట్టలేదని, వాళ్లు రెచ్చగొడితేనే బాలయ్య రియాక్ట్ అయ్యారన్నారు. బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్పీకర్ ఒకవైపు మాత్రమే చూస్తున్నారని, రెండు వందలమంది మార్షల్స్ ను పెట్టి సభ నడపడం దుర్మార్గమన్నారు. మంత్రి అంబటి తీరు, ఎమ్మెల్యేలపై చర్యలు లేవేమని ప్రశ్నించారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా లేదన్నారు.
బీఏసీని బహిష్కరించిన టీడీపీ
శాసనసభ బీఏసీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చిప్ విప్ ప్రసాద్ రాజు తదితరులు హాజరయ్యారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 27 వరకు శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. శని, ఆదివారం శాసన సభకు సెలవుగా ప్రకటించారు.
బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య హడావుడి
పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. స్పీకర్‍పై టీడీపీ నేతలు ఫైల్స్ విసిరేసి బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారని, సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందని విమర్శించారు. బావ కళ్లల్లో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడని, - బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడన్నారు.బాబు అవినీతి చేసి దొరికిిన దొంగ అని, తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చారని రోజాప్రశ్నించారు. హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా? అని అక్రమంగా ప్రజల డబ్బును దోచేసి బాబు అరెస్టయ్యాడన్నారు. చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటకి తీస్తామని, దమ్ము, ధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్దమై చర్చకు రావాలన్నారు.
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు బీఏసీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు.
సభలో వీడియో తీయడంపై రగడ
శాసనసభలో జరుగుతున్న రగడను వీడియో తీయడంపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలాను వీడియో తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అనగాని, కోటంరెడ్డి, పయ్యావుల కేశవ్‌లను సభ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అనగాని కోటంరెడ్డిలపై సస్పెన్షన్ వేటు
సభ్యులు సభ ఆస్తిని ధ్వంసం చేస్తే సభ్యుల నుంచి దానిని రికవరీ చేస్తామని, శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లు కాగితాలు చించేసి, మానిటర్ పగులగొట్టారని, మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఎథిక్స్ కమిటీని సూచించారు. అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్‌పై డోలా బాల వీరాంజనేయులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
బాలకృష్ణకు స్పీకర్ ఫస్ట్ వార్నింగ్….
సభా స్థానాన్ని అగౌరవపరిచారని, టీడీపీ సభ్యులు తొడలు చరచడం, మీసాలు మెలేసి వికృతంగా ప్రవర్తించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని, ఆయన తొలితప్పుగా భావించి మొదటి వార్నింగ్ ఇస్తున్నామని, ఇలాంటివి పునరావృతం చేయొద్దని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. శాసన సభ నియమాల ప్రకారం 365 నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేస్తే ఆస్తి విలువను సభ్యుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. సభా స్థానాన్ని చుట్టుముట్టి కాగితాలు విసిరి సభ ఔన్నతాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారన్న పయ్యావుల
శాసన సభలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తాము వాళ్ల ట్రాప్‍లో పడలేదన్నారు. సభలో హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
శాసన మండలిలోను కొనసాగిన రచ్చ
ఏపీ శాసన మండలిలో కూడా టీడీపీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు అంశంపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోసం పట్టు బట్టారు. మండలి ఛైర్మన్ అంగీకరించకపోవడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మండలి కూడా వాయిదా పడింది.
పేర్ని, బుచ్చయ్య మధ్య ఆసక్తికరమైన చర్చ
టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసు చంపుకుని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని అసెంబ్లీ లాబీలో వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం కాదు రాజ్యాంగం కోసం తాను పోరాడుతున్నామని బుచ్చయ్య చౌదరి బదులిచ్చారు.
అసెంబ్లీ వాయిదా
ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన పావుగంట వ్యవధిలోనే వాయిదా పడింది. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. హిందూపురం ఎమ్మెల్యే సభలో మీసం మెలేయడంతో వైసీపీ సభ్యులు ఆగ్రహంతో అతని మీదకు దూసుకెళ్లారు. దీంతో సభను వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగా టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబడుతూ స్పీకర్ పోడియంను ముట్టడించారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం, కాగితాలు చించి విసిరే ప్రయత్నం చేయడంతో సభ వాయిదా పడింది.
కోర్టుకెళ్లి బల్లలు కొట్టాలన్న అంబటి
అసెంబ్లీలో బాలకృష్ణ బల్లలు కొట్టి, మీసాలు మెలేయడంపై అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బాలకృష్ణ సినిమాల్లో అలాంటివి చేసుకోవాలని ఇక్కడ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా టీడీపీ సభ్యులతో జత కలిశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ పోడియంను ముట్టడించారు.
మరికాసేపట్లో బిఏసి సమావేశం
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మరికాసేపట్లో బిఏసీ సమావేశం జరుగనుంది. సభ నిర్వహణపై అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
మీసం మెలేసిన బాలకృష్ణ
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంతో అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసుకుందాం రావాలంటూ సవాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి మీసం మెలేయడంతో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాలకృష్ణపైకి దూసుకెళ్లి తొడగొట్టారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
టీడీపీ సభ్యులపై అంబటి ఫైర్
టీడీపీ సభ్యులు స్పీకర్ మీద దాడికి సిద్ధపడుతున్నారని, సభలో అవాంఛనీయ ఘటనలు జరిగేలా రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి ఆరోపించారు. స్పీకర్ మీద దాడి చేయడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, టీడీపీ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ సభ్యులపై బుగ్గన ఆగ్రహం
సభను జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు.
వాయిదా తీర్మనం ప్రవేశపెట్టిన టీడీపీ
చంద్రబాబు నాయుడు వ్యవహారంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రకటించారు. అర్థంపర్థం లేని వాయిదా తీర్మానాలతో సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సభ పట్ల గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టప్రకారం న్యాయవిచారణ జరుగుతున్నా తాము సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిఏసి సమావేశంలో సభ నిర్వహణపై చర్చించిన తర్వాత తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని బుగ్గన చెప్పారు. సరైన పద్ధతిలో చర్చకు రావాలని టీడీపీ సభ్యులకు సూచించారు.