AP Assembly Session Live Updates : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - సభకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు
22 June 2024, 14:27 IST
- AP Assembly Session Live Updates :రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలను స్వీకరించారు. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ఏపీ తొలి కేబినెట్ భేటీ
ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఏపీ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్‌లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
బాధ్యతతో కూడినది - స్పీకర్ అయ్యన్నపాత్రుడు
స్పీకర్ హోదా అనేది చాలా బాధ్యతతో కూడినదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సభలోకి ఎక్కువ మంది మహిళలు రావటం సంతోషంగా ఉందన్నారు. ఇందులో కూడా ఎక్కువ మంది అధిక చదువులు పూర్తి చేసినవారు ఉండటం మంచి పరిణామం అని అన్నారు.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - స్పీకర్
తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం కల్పించిన సభ్యులకు నమస్కారాలు తెలిపినట్లు వెల్లడించారు.
ఇవాళ్టితో సమావేశాలు పూర్తి…
ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కానున్నాయి. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
కొనసాగుతున్న సభ..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు సభలో మాట్లాడుతున్నారు.
సభకు దూరంగా వైసీపీ
స్పీకర్ ఎన్నిక వేళ వైసీపీ తరపు గెలిచిన ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉన్నారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సభకు హాజరుకాలేదు.
ప్రశంసలు
మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… అయ్యన్నపాత్రుడిపై ప్రశంసులు గుప్పించారు.
మచ్చలేని నేత - మంత్రి అనిత
మంత్రి అనిత మాట్లాడుతూ… మా ప్రాంతం నుంచి వచ్చిన అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికవ్వటంపై ఆనందం వ్యక్తం చేశారు. తాతాజీగా పిలుచుకునే అయ్యన్నపాత్రుడు….7 సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఎలాంటి మచ్చలేని నేతగా పని చేశారని గుర్తు చేశారు.
ఇకపై హుందాతనం చూస్తాం - పవన్
"ఎంతో అనుభవం, వాగ్ధాటి ఉన్న వ్యక్తి స్పీకర్ అయ్యన పాత్రుడు గారు, ఇన్ని దశాబ్దాలు ప్రజలు ఆయన మాటల్లోనే వాడి,వేడి చూసారు, ఇకపై ఆయన హుందాతనం చూస్తారు" అని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు.
అచ్చెన్న ప్రశంసలు
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… బలహీనవర్గాల నుంచి వచ్చిన అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో పని చేసిన వ్యక్తిగా పేరొందని గుర్తు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలోనూ… 1996లో ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. పార్టీ ఆదేశాలను పాటించే వ్యక్తుల్లో అయ్యన్నపాత్రుడు ముందు ఉంటారని గుర్తు చేశారు.
మంత్రి సత్య కుమార్ ఏమన్నారంటే…
బీజేపీ నుంచి గెలిచి మంత్రిగా ఉన్న సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు. అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు గుప్పించారు. సభను సరైన తోవలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి లోకేశ్ అభినందనలు
పవన్ కల్యాణ్ తర్వాత మంత్రి నారా లోకేశ్ సభను ఉద్దేశించి మాట్లాడారు. 25 ఏళ్ల వయసులోనే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని అన్నారు. 7సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని అన్నారు.
పవన్ అభినందనలు
చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. స్పీకర్ ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి అభినందనలు తెలిపారు.
దూషణలు వద్దు - చంద్రబాబు
ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ హుందాతనంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వ్యక్తిగత దూషణలకు వెళ్లొద్దని సభ్యులను కోరారు.
వెనక్కి తగ్గలేదు….
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి నర్సీపట్నం నుంచి పోటీ చేసిన ఏకైక వ్యక్తిగా అయ్యన్నపాత్రుడు ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. గత ఐదేళ్లలో 23 కేసులు నమోదు చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదని చెప్పారు.
సీఎం చంద్రబాబు ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ శాసనసభ్యుడిగా అయ్యన్నపాత్రుడికి పేరుందని సీఎం చంద్రబాబు కొనియాడారు. బీసీ సామాజికవర్గం నుంచి ఆయన… 7 సార్లు ఎమ్మెల్యేగాగెలిచారని గుర్తు చేశారు. 1996లో అనకాపల్లి ఎంపీగా కూడా గెలిచారని తెలిపారు.
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, పవన్ తో పాటు పలువురు మంత్రులు స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి… కూర్చోబెట్టారు.
ప్రమాణం చేసింది వీరే……
జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
వారితో ప్రమాణం
శుక్రవారం ప్రమాణస్వీకారం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేస్తున్నారు.
సభకు దూరంగా వైసీపీ…?
ఇవాళ్టి సభకు వైసీపీ దూరంగా ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ పులివెందులలో జగన్ పర్యటించనున్నారు.
డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి…?
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా…టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యే ప్రమాణం…
ఇతర కారణాలతో శుక్రవారం సభకు రాని ముగ్గురు ఎమ్మెల్యేలు కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
172 మంది ప్రమాణం
కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. శుక్రవారం శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపు….
అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న...ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన... యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు.
అయ్యన్నపాత్రుడు ప్రస్థానం…
చింతకాయల అయ్యన్నపాత్రుడు...టీడీపీ సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు - 2024
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక ఉండనుంది.