Skill Scam: ఆంధ్రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు.. రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ
16 October 2024, 7:47 IST
Skill Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - సీమెన్స్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.23 కోట్లకు పైగా విలువైన కొత్త ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ.23కోట్ల ఆస్తుల జప్తు
Skill Scam: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభి వృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్, వారి సన్నిహితుల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పింది.
ఏపీ ప్రభుత్వం నుంచి ఆయా సంస్థలకు నిధులు విడుదలైన తర్వాత.. వాటిని షెల్ కంపెనీలకు మళ్లించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఎంట్రీ ప్రొవైడర్స్‌కు కమీషన్లు చెల్లించడం ద్వారా అంతర్గ తంగా ఆయా కంపెనీల మధ్య నిధులు మళ్లించి నట్లు ఈడీ వెల్లడించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఏదీ కనిపించలేదని ఈడీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబును గత ఏడాది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ కేసులో రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసింది.
దక్షిణాది రాష్ట్ర సీఎంగా మూడోసారి (2014-2019) ఉన్న సమయంలో రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
సీమెన్స్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిటిఎస్పిఎల్) అనే కంపెనీ మరియు ఇతరులపై ఆంధ్రప్రదేశ్ సిఐడి గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఢిల్లీ-ఎన్సిఆర్, ముంబై, పూణేలలో ఉన్న నివాస ఆస్తులతో పాటు బ్యాంకు డిపాజిట్లు, షేర్లు వంటి ఆస్తులను జప్తు చేయాలని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడి తెలిపింది.
ఆస్తుల విలువ రూ.23.54 కోట్లు.
డీటీఎస్ పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ), వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్ లు బహుళ అంచెల లావాదేవీల ద్వారా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని, మెటీరియల్/సేవల సరఫరా నెపంతో బోగస్ ఇన్ వాయిస్ ల ఆధారంగా నిధులను దారి మళ్లించారని దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
నిధులను మళ్లించడానికి ఎంట్రీ ప్రొవైడర్ల సేవలను తీసుకున్నామని, వాటికి కమీషన్ చెల్లించామని నిందితులు పేర్కొన్నట్టు దర్యాప్తు సంస్థ వివరించింది. ఈ దర్యాప్తులో భాగంగా డీటీఎస్ పీఎల్ కు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను జప్తు చేసింది.
ఖాన్వేల్కర్, బోస్, అగర్వాల్, గోయల్లను అరెస్టు చేసిన ఈడీ విశాఖలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
సెప్టెంబర్ 9న ముందస్తు అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో గడిపారు.
అక్టోబర్ 31న ఇచ్చిన మధ్యంతర బెయిల్ నవంబర్ 20న సంపూర్ణం కావడంతో 2024 ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు చంద్రబాబు నాయుడుకు స్వేచ్ఛ లభించింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది.