తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ssc Exam Pattern Change: ఏపీ పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాల్లో మార్పులు

SSC Exam Pattern Change: ఏపీ పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాల్లో మార్పులు

Sarath chandra.B HT Telugu

28 July 2023, 9:48 IST

google News
    • SSC Exam Pattern Change: ఆంధ్రప్రదేశ్‌  పదోతరగతి తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేస్తున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో నూతన మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త పరీక్షా పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల మార్పు
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల మార్పు

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల మార్పు

SSC Exam Pattern Change: ఏపీలో పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేస్తున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదోతరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలను మారుస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరానికి 2024లో జరిగే వార్షిక పరీక్షలకు ఇదే విధానంలో ప్రశ్నపత్రాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎక్కువ మంది తెలుగు, హిందీలో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ప్రశ్నల విధానాన్ని మార్చింది. సైన్స్‌ సబ్జెక్టుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది ఒకటే ప్రశ్నపత్రంలో పార్ట్‌-ఏలో భౌతిక, రసాయన శాస్త్రం, పార్ట్‌-బీలో జీవశాస్త్రం నుంచి ప్రశ్నలు ఇచ్చారు. కామన్‌ పరీక్షల్లో విద్యార్ధులు సమాధానాలు రాసేందుకు మాత్రం విడివిడిగా బుక్‌లెట్‌లు ఇచ్చారు. ఈ మార్పును గుర్తంచలేక కొందరు విద్యార్థులు జవాబులను కలిపి రాయడంతో మూల్యాంకనం సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

విద్యార్ధులు గందరగోళానికి గురికాకుండా ఈ ఏడాది ప్రశ్నపత్రాలు, సమాధానాలు రాసే బుక్‌లెట్‌లను విడివిడిగా ఇవ్వాలని పరీక్షల విభాగం నిర్ణయించింది. మొదట భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నపత్రం ఇస్తారు. వీటికి సమాధానాలు రాసిన తర్వాత జీవశాస్త్రం ప్రశ్నపత్రం ఇస్తారు.

ఈ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆంగ్లం, గణితం, సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. నమూనా ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

మరోవైపు హిందీలో 14 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 19 ఇవ్వనున్నారు. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. 8మార్కులకు ఒక పద్యం ఇచ్చి, దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఇవ్వనున్నారు.

తెలుగు పరీక్షకు సంబంధించి గతంలో 8మార్కులకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న స్థానంలో, ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు.

రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, దానికి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సిన ప్రశ్నను తీసుకొచ్చారు. ఇందులో ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు. నాలుగో ప్రశ్నగా పత్రికల్లో వచ్చిన ఓ వార్తను ఇచ్చి దానిపై ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడా ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8మార్కులు కేటాయించారు.

రెండో విభాగంలో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి 36మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. మూడో విభాగంలో పదజాలం, వ్యాకరణంపై 32మార్కులకు ప్రశ్నలు ఉన్నాయి.

మొత్తం పరీక్ష పత్రాన్ని విద్యార్ధుల అవగాహన-ప్రతిస్పందనకు 32మార్కులు, భావ వ్యక్తీకరణ-సృజనాత్మకతకు 36 మార్కులు, భాషాంశాలకు 32 మార్కులు కేటాయించేలా మొత్తం వంద మార్కులకు ప్రశ్నపత్రాన్ని రూపొందించారు.

వీటిలో వ్యాసరూప ప్రశ్నలు 56మార్కులు, లఘుప్రశ్నలు 12 మార్కులు, అతిలఘు ప్రశ్నలు 18 మార్కులు, లక్ష్యాత్మక ప్రశ్నలు 14 మార్కులకు కేటాయించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

తదుపరి వ్యాసం