తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  No Impact Of H3n2 Virus : ఏపీలో వైరస్ ప్రభావం పెద్దగా లేదని ప్రకటించిన వైద్యశాఖ

No Impact Of H3N2 Virus : ఏపీలో వైరస్ ప్రభావం పెద్దగా లేదని ప్రకటించిన వైద్యశాఖ

HT Telugu Desk HT Telugu

10 March 2023, 9:20 IST

google News
    • No Impact Of H3N2 Virus జ్వరాలు,జలుబు,దగ్గులతో  జనం పెద్ద ఎత్తున సతమతమవ్వడం, కొత్త వైరస్‌లు కలకలం సృష్టిస్తున్న వేళ ఏపీలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ప్రభావం పెద్దగా లేదని వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ జ్వరాలు, సీజనల్ వ్యాధులు మినహా కొత్త వైరస్‌లు విస్తరించడం లేదని భరోసా ఇచ్చారు. 
ఆంధ్రాలో ఆ వైరస్ ప్రభావం అంతంతమాత్రమే...
ఆంధ్రాలో ఆ వైరస్ ప్రభావం అంతంతమాత్రమే... (HT_PRINT)

ఆంధ్రాలో ఆ వైరస్ ప్రభావం అంతంతమాత్రమే...

No Impact Of H3N2 Virus ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం ఫ్లూ “హెచ్‌3ఎన్‌2” ప్రభావం పెద్దగా లేదని ఏపీ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వ్యాధుల వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, అనవసర భయాలు అక్కర్లేదన్నారు.

కొత్త వైరస్‌‌కు ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ప్రభావం ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్‌ మాదిరి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం హెచ్‌3ఎన్‌2 వైరస్‌కు లేదన్నారు.

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న కొందరిలో మాత్రమే వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుందన్నారు. ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుందని, దీనిని కనిపెట్టడం చాలా సులభం అని వివరించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నామని, తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్‌ చేస్తున్నట్లు డిఎంఇ ప్రకటించారు. వైరస్ సీక్వెన్సింగ్‌లో గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదైనట్లు చెప్పారు.

దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వైరల్‌ జ్వరాలకు యాంటిబయోటిక్స్‌ పనిచేయవని, జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దని హెచ్చరించారు. జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారిలో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్‌ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు డా. సుధాకర్‌ చెప్పారు.

ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్‌ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్‌ బిళ్లలు వాడాలన్నారు. ప్రతి ఏడాది సీజన్‌ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయని గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘు తెలిపారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు.

వచ్చే ఏడాది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు…

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్‌ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. ఖాళీ అయిన 246 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఎన్నికల కోడ్‌ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్‌ రెసిడెంట్‌ల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్‌ చెప్పారు.

తదుపరి వ్యాసం