AP Assembly Sessions: భారీ విజయాన్ని అస్వాదించలేని ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్న గవర్నర్
22 July 2024, 13:21 IST
- AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నేతలు అక్కడి నుంచి అసెంబ్లీకి తరలి వెళ్లారు.
ముగిసిన బిఏసీ సమావేశం, 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బిఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 26వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
ఏపీ అసెంబ్లీ బిఏసీ సమావేశం ప్రారంభం
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు. చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు భేటీలో పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మరికాసేపట్లో బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన జరుగనుంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
గెలుపును అస్వాదించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం
దేశ చరిత్రలో మొదటి సారి ఓ ప్రభుత్వం ఎన్నికల్లో సాధించిన విజయాన్ని అస్వాదించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడి పూర్వ వైభవాన్ని సంతరించుకోడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరాం. పొరుగు రాష్ట్రంతో ఉన్న సమస్యలను ఇరుపక్షాలకు అమోదయోగ్యం పరిష్కరించి, రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్టు గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు.
ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం…
రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వంకట్టుబడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలతో భారీగా ఆదాయానికి గండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయిందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. వాటిని గాడిన పెట్టడం ప్రభుత్వానికి సవాలుగా మారిందన్నారు.
వ్యవస్థలు ధ్వంసం చేశారు
ఐదేళ్ళలో ప్రకృతి వనరుల దోపిడీతో వనరుల్ని యథేచ్చగా దోపిడీ చేశారని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఏపీ పరిణామాలు అందరిని కలిచి వేశాయి
ఐదేళ్లుగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తీవ్రంగా కలిచి వేశాయి. అంతా కలిసి కట్టుగా సమిష్టిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.
రాష్ట్రం పరువు తీశారు…
అమరావతి నిర్మాణాన్ని దెబ్బతీయడంతో జాతీయ స్థాయిలో ఏపీ పరువును దెబ్బతీశారని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. విధ్వంసకర విధానాలతో పాలన సాగించారని పేర్కొన్నారు.
ప్రజా వేదిక ధ్వంసంతో పాలన ప్రారంభం
ఐదళ్ల క్రితం ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో పాలన ప్రారంభమైందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన, సేవ్ డెమోక్రాసీ నినాదాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రాసీ అంటూ నినాదాలు ప్రారంభించారు.
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ
ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నెలాఖరుతో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువును శాసనసభా సమావేశాల్లో పొడిగించనున్నారు. మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అక్టోబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. వైసీపీ పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు, మరో మూడు శ్వేతపత్రాలను సభలో విడుదల చేయనున్నారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థికశాఖల అంశాలపై సభలో చర్చించనున్నారు.
పసుపు కండువాలతో సభకు బయల్దేరిన టీడీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో సభకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు శాసనసభ ప్రాంగణంలో గవర్నర్‌కు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.
వెంకటపాలెంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళులు
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు.
నల్లకండువాలతో అసెంబ్లీకి వైసీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా నల్లకండువాలతో సభకు హాజరు కావాలని నిర్ణయించారు.
గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఏపీ అసెంబ్లీలో మరోసారి ప్రతిపక్ష నేత హోదా తెరపైకి రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. వైసీపీకి 11 సీట్లే వచ్చాయి కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెబుతోంది. మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరపలేదు.