తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Privilege Notice: గవర్నర్‌కు అవమానం వార్తలపై అసెంబ్లీలో రగడ..

Privilege Notice: గవర్నర్‌కు అవమానం వార్తలపై అసెంబ్లీలో రగడ..

HT Telugu Desk HT Telugu

15 March 2023, 13:29 IST

google News
    • Privilege Notice: ఆంధ్రప్రదే‌శ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు అవమానం జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై శాసనసభలో వాడీవేడిగా చర్చ జరిగింది.సభలో గవర్నర్‌ని అవమానించారనే  తప్పుడు కథనాలపై ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులివ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు.
పత్రికా కథనాలపై ఏపీ అసెంబ్లీలో రగడ
పత్రికా కథనాలపై ఏపీ అసెంబ్లీలో రగడ

పత్రికా కథనాలపై ఏపీ అసెంబ్లీలో రగడ

Privilege Notice: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు అవమానం జరిగిందంటూ టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణల్ని యథాతథంగా ప్రచురించడంపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సభలో చదివి వినిపించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, మంగళవారం సభలో జరిగిన పరిణామాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు.

మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సిఎం జగన్ ఉదయం 9.45కు అసెంబ్లీకి వస్తే, గవర్నర్ 9.53కు వచ్చారని తెలిపారు. శాసనసభ వెలుపల ఉదయం 10.2 నిమిషాలకు గవర్నర్‌కు ముఖ్యమంత్రి స్వాగతం పలికి, భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌కు, సిఎం, స్పీకర్‌, మండలి ఛైర్మన్‌లతో కలిసి తీసుకు వచ్చారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభకు వివరించారు. స్పీకర్‌ కార్యాలయంలో గవర్నర్ ఫ్రెష్ అయిన తర్వాత సభలోకి తీసుకు వచ్చారని చెప్పారు.

ఈ క్రమంలో గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఎక్కడా అవమానించలేదన్నారు. పయ్యావుల కేశవ ఉద్దేశపూర్వకంగానే శాసనసభను ఉద్దేశించి తప్పుడు ఆరోపణలు చేస్తే, వాటిని యథాతథంగా ప్రచురించారని తెలిపారు. గవర్నర్‌ రాక సందర్భంగా ముఖ్యమంత్రి అవమానించారని, గవర్నర్‌ వేచి ఉండేలా చేశారని అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.

ముఖ్యమంత్రికి గవర్నర్‌కు స్వాగతం పలకలేదని, ముఖ్యమంత్రి కోసం వేచి ఉన్నారని తప్పుడు వార్తలు రాయడంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అమోదంతో పయ్యావుల కేశవ్‌తో పాటు వార్తల్ని ప్రచురించిన సంస్థపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి సభకు వచ్చిన తర్వాతే గవర్నర్ వచ్చారని, గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకున్న తర్వాత సభలోకి వచ్చారని, గవర్నర్‌ను స్పీకర్ ఛాంబర్‌లోకి తీసుకెళ్లారని కౌన్సిల్ వైస్ ఛైర్మన్ కూడా ఆ సమయంలో ఛాంబర్‌లో ఉన్నారని చెప్పారు. గవర్నర్ గొంతు నొప్పితో బాధపడుతున్నారని ఆ సమయంలో వేడి నీళ్లు తీసుకున్న తర్వాత సభలోకి వచ్చారని బుగ్గన చెప్పారు.

సభ నిర్వహణపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దిశ విషయంలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పిన బుగ్గన, గవర్నర్ ప్రసంగంలో ఉన్న పేరాను చదివి వినిపించారు. దిశ బిల్లును 2020, జనవరి 21న, 31న రెండుసార్లు, ఫిబ్రవరి23న మరోసారి కేంద్ర హోంశాఖ సందేహాలను నివృత్తి చేసినట్లు బుగ్గన చెప్పారు. ఆ తర్వాత కూడా పలుమార్లు సంప్రదింపులు జరిగాయన్నారు.

శాసనసభ గౌరవానికి భంగం కలిగించే అవాస్తవాలు రాయకుండా, ప్రచురించకుండా బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, శాసన సభా వ్యవహారాల అగౌరవపరిచినందుకు చర్యలు తీసుకోవాలని బుగ్గన కోరారు. శాసన సభ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో స్పీకర్ అందుకు సమ్మతించారు.

మరోవైపు కేశవ్‌ వ్యవహారంలో చర్చ సందర్భంగా రాష్ట్రంలో మీడియా పాత్రపై శాసనసభలో చర్చ జరగాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. జరగని విషయాలను జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని, ఇంత వక్రీకరణ గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. చట్టాలకు, చట్టబద్ద సంస్థల గౌరవానికి భంగం కలిగేలా టీడీపీ వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తోందన్నారు.

టీడీపీ అనుకూల పత్రికల విషయంలో కొన్ని వందల ఉదాహరణలు తాను చెప్పగలనని కన్నబాబు అన్నారు. గవర్నర్ ఉదంతంతోనే టీడీపీ వైఖరి ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదంతంతో బయటపడిందని, రాష్ట్రంలో మీడియా పాత్రపై ఖచ్చితంగా సభలో చర్చ జరగాల్సి ఉందని, ప్రతిపక్ష పార్టీ టీడీపీనో, టీడీపీ అనుకూల పత్రికలో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నవి, లేవిని కలిపి మీడియాలో వార్తల వక్రీకరణ జరుగుతోందని కన్నబాబు ఆరోపించారు. టీడీపీ నాయకుడు కేశవ్‌తో పాటు పత్రికలపై చర్యలు తీసుకోవాలని మంత్రులు రాంబాబు, బొత్స, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున తదితరులు డిమాండ్ చేశారు.

మరోవైపు గవర్నర్ ప్రసంగంలో ఉన్న వాటినే తాను ఉదహరించాను తప్ప అవాస్తవాలు ప్రచారం చేయలేదని టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చెప్పారు.

తదుపరి వ్యాసం