December 23 Telugu News Updates : నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత…
23 December 2022, 21:30 IST
- తెలుగు చలన చిత్ర నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ తెల్లవారు జామున మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. కైకాల సత్యనారాయణ మృతికి పలువురు నటులు సంతాపం తెలియచేశారు. ఆయన అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తుండగా… తాజాగా పలు సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 581 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్ పోస్టులతో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
దొంగల హల్ చల్
బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఓ భక్తురాలి నుంచి రూ.15లక్షల విలువైన బంగారం, రూ.60 వేలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సీపీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు దుర్గగుడి సిబ్బంది, పోలీసులు తెలిపారు.
కేసీఆర్ నివాళులు
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు
మరో నోటిఫికేషన్
ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయించింది హెచ్ఎండీఏ. అయితే తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. బండ్లగూడ, పోచారంలో కొన్ని ఫ్లాట్లు వేలం ప్రక్రియలో అమ్ముడు పోలేదు. దీంతో మిగిలిన ఫ్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు చేయనున్నట్లు హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు జనవరి 18వ తేదీని తుది గడువు విధించింది. బండ్లగూడలో 1 BHK ఫ్లాట్లు 364 ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఇక పోచారంలో చూస్తే 1 బీహెచ్ కె, 2 బీహెచ్ కె, 3 బీహెచ్ కె ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి వివరాలను కూడా ప్రకటనలో స్పష్టం చేసింది.
సీఎం జగన్ ఫైర్
కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన.. మహానేత వైఎస్‌ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తైందని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరోపార్టీ అని చంద్రబాబులా వ్యవహరించడం తనకు తెలియదన్నారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అననని, ఒకే భార్య.. ఒకటే రాష్ట్రం, ఇక్కడే నివాసం అనేదే తన విధానం అంటూ పవన్ ను టార్గెట్ చేశారు జగన్.
గంజాయి వివరాలు
Ganja Destroy in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గతేడాది నుంచి ప్రత్యేక డ్రైవ్(Special Drive) ద్వారా రాష్ట్రంలో వేలాది ఎకారాల్లో గంజాయి తోటలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ ఏడాదిలో గజాయి నివారణ కోసం తీసుకున్న చర్యలు, పట్టుబడి మొత్తం వివరాలను ఏపీ పోలీసులు వెల్లడించారు.
ఏపీలోని విశాఖ రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి సరఫరా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. గతేడాది 30వ తేదీన ప్రత్యేక ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టగా.. ఆయా ప్రాంతాల్లో గణనీయంగా గంజాయి సాగు తగ్గుముఖం పట్టిందని వివరించారు. మొత్తం రెండు విడతల్లో చర్యలు చేపట్టామని.. ఓవైపు గంజాయి సాగును ధ్వంసం చేస్తూనే.. మరోవైపు పడిస్తన్న వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. తీరు మార్చుకోని వారిపై పీడీ యాక్టులు కూడా నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
శ్రీశైలం టూర్…
ఈనెల 26న శ్రీశైలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంగిన పెద్ద నాలా
హైదరాబాద్ గోషామహల్ చాక్నవాడిలో పెద్దనాలా కుంగిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో నాలాలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు పడిపోయాయి. నాలాపై ఉన్న దుకాణాలు కూడా నాలాలో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
అంతర్గత పోరు
Internal Fight in BRS Greater Hyderabad: ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు..! ఇంకేముంది నేతల మధ్య మాటలు పేలుతున్నాయి. టైం కోసం వెయిట్ చేస్తున్న కొందరు నేతలు... వ్యూహలకు పదనుపెడుతున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ లో చూస్తే పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఏకంగా ఓ మంత్రికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావటం, సూటిగా విమర్శలు చేయడంతో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి.
కడపలో సిఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కడపలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు కడప, కమలాపురం, ఇడుపులపాయ, పులివెందులలో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడప ఎయిర్ పోర్ట్ కు 12.35 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కడప ఎయిర్ పోర్ట్ నందు ఘన స్వాగతం లభించింది.
టీటీడీ ఈవోగా సింఘాల్‌కు అదనపు బాధ్యతలు
టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈవో ధర్మారెడ్డి సెలవులో ఉండటంతో టిటిడి ఈఓ ఫుల్ అడిషనల్ ఛార్జిగాఅనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.
రామచంద్ర భారతికి రిమాండ్
దొంగ పాస్ పోర్ట్ కేసులో రామచంద్ర భారతిని తెలంగాణ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.నాంపల్లి కోర్టు రామచంద్రభారతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని బంజారాహిల్స్ పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు.
నటి రోజా సంతాపం
కైకాల సత్యానారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా సంతాపం తెలిపారు. కైకాల మరణం బాధాకరమని, 750కి పైగా చిత్రాల్లో నటించి నవరస నటనా సార్వభౌముడు అనిపించారని గుర్తు చేసుకున్నారు.
బాలకృష్ణ సంతాపం
కైకాల మృతిపట్ల సినీనటులు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత అని కొనియాడారు. కైకాల బహుమఖ ప్రజ్ఞాశాలి అని, కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. ఎన్టీఆర్ తో కలిసి పలు చిత్రాల్లో ఆయన అభినయం ఎన్నటికీ మరవలేమన్నారు.
సినీ నటుడు చిరంజీవి సంతాపం
కైకాల మరణం సినీ రంగానికి తీరని లోటన్నారు చిరంజీవి. కైకాలతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించానని - కైకాల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. - కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల 6న జరగాల్సిన సమావేశం వచ్చే నెల 11కు వాయిదా పడింది. జనవరి 5, 6 తేదీల్లో భోపాల్‌లో వాటర్ విజన్-2047 భేటీ దృష్ట్యా కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈనెల 26 వరకు ఎజెండా ప్రతిపాదిత అంశాలను పంపాలని కేఆర్ఎంబీ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది.
అందుబాటులోకి నాజిల్ వ్యాక్సిన్
భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ కు ఆమోదం లభించింది. బూస్టర్ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్‌ను కేంద్రం అందించనుంది. మొదట ప్రైవేట్ ఆస్పత్రుల్లో నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.