November 21 Telugu News Updates : పాతబస్తీలో బాంబు కలకలం
21 November 2022, 23:10 IST
- సూపర్ స్టార్ కృష్ణ అస్తికలను నిమజ్జనం చేసేందుకు ఆయన తనయుడు మహేష్ బాబు విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నటుడు మహేష్ బాబు బంధుమిత్రులతో కలిసి అస్తికలను కృష్ణా నదిలో కలిపారు. మహేష్ బాబుతో పాటు గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు. అభిమానులు ఎగబడతారనే ఉద్దేశంతో పోలీసులు మహేష్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మంత్రి తలసాని పీఏపై ఈడీ ప్రశ్నల వర్షం
క్యాసినో కేసులో ఈడీ విచారణ జరుగుతుంది. ఈడీ ఎదుట మంత్రి తలసాని పీఏ హరీష్, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి హాజరయ్యారు. వారిని ఈడీ 7 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు ఆత్మహత్య
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు అక్షయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీలో బాంబు కలకలం
హైదరాబాద్ పాతబస్తీలో బాంబు కలకలం రేగింది. ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేసి.. చార్మినార్ వద్ద బాంబు పెట్టామని చెప్పాడు. ఫోన్ కాల్ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తో కలిసి పోలీసులు.. అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజంగానే బాంబ్ పెట్టారా.. లేదంటే ఎవరైనా కావాలనే కాల్ చేసి చెప్పారా అనేది తెలియాల్సి ఉంది.
వణికిస్తున్న చలి
మూడు నాలుగు రోజుల నుంచి తెలంగాణలో చలి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రైతే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిర్పూర్ లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే.. చలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురి నిందితులకు సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో హై కోర్ట్ ఆదేశానుసారం నడుచుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.
చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్న బొత్స
చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు. వైసీపీ వెనుక ప్రజలున్నారని అసహనానికి లోనవుతున్నారని చెప్పారు. ఏపీలో భూ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, భూ సమస్యల పరిష్కారానికి భూ హక్కు కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. ఈ నెల 23న నరసన్నపేటలో రెండో విడత శాశ్వత భూ హక్కు కార్యక్రమం చేపడతామని మంత్రి బొత్స చెప్పారు.
నరసాపురంలో సీఎం జగన్ పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటన జరుగుతోంది. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపనతో పాటు జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకం ప్రారంభించారు.
చేతకాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు
చేతకాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని సిపిఐరాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోదీని పోలవరంపై ఎందుకు నిలదీయలేదని, ఏపీలో అభివృద్ధి నిరోధక పాలన కొనసాగుతోందని, పరిశ్రమలు రాకుండా ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సమైక్య ఉద్యమాలు చేపడతామని సీపీఐ రామకృష్ణ ప్రకటించారు.
సిఎస్‌తో టిపిసిసి బృందం భేటీ
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో టీపీసీసీ ప్రతినిధి బృందం భేటీ కానున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై సిఎస్ తో సమావేశమై వినతిపత్రం సమర్పించనున్నారు.
భీమవరంలో టీడీపీ, బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్
భీమవరంలో టీడీపీ, బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆక్వా సమస్యలపై టీడీపీ, బీజేపీ నాయకుల నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి భీమవరం పోలీసులు కారణాలు చెప్పకుండా తీసుకెళ్లడాన్నిబీజేపీ నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు.
వనపర్తిలో ఘోర ప్రమాదం
వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ట్రాక్టర్‍ను, ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొట్టి ముగ్గురు మృతి చెందారు. 16 మందికి గాయలు అయ్యాయి. - మృతుల్లో బస్సు డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‍లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోెంది. ఆదివారం శ్రీవారిని 80,294 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లుగా ఉంది.
జాకీ పరిశ్రమ తరలిపోవడంపై మాటల యుద్ధం
రాష్ట్రంలో జాకీ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాయలసీమలో మేం తెచ్చిన పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్లాయని ప్రశ్నించారు. - రాయలసీమ నుంచి పెట్టుబడులను తరిమేసింది ఎవరని నిలదీశారు. రాయలసీమ ద్రోహులు ఎవరు?.. పరిశ్రమలు తెచ్చిన మేమా.. డబ్బు కక్కుర్తితో వెళ్లగొట్టిన మీరా అని ప్రశ్నించారు.
ఒడిశాలో రైలు ప్రమాదం
ఒడిశాలోని కొరై రైల్వే స్టేషన్‍లో ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వెయిటింగ్ హాలును ఢీకొట్టింది. గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. బోగీల కింద మరికొందరు చిక్కుకుపోయారు. రైలు ఢీకొట్టడంతో స్టేషన్ భవనం ధ్వంసమైంది. పది బోగీలు బోల్తా కొట్టడంతో రైల్వే స్టేషన్‌లో ఉన్న పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ మత్స్యకార దినోత్సవం…
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కటుంబాల్లో కొత్త వెలుగులు నింపామని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, నరసాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సిఎం ప్రకటించారు.