తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  August 15 Telugu News Updates : తిరుమలలో భక్తుల రద్దీ.. 50 మందితో బ్రేక్ దర్శనానికి వెళ్లిన మంత్రి
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

August 15 Telugu News Updates : తిరుమలలో భక్తుల రద్దీ.. 50 మందితో బ్రేక్ దర్శనానికి వెళ్లిన మంత్రి

15 August 2022, 21:25 IST

  • దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. రానున్న 25ఏళ్లలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు.

15 August 2022, 21:25 IST

ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాని సీఎం కేసీఆర్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై తేనీటి విందు ఇచ్చారు. ఈ వేడుకకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు.

15 August 2022, 17:03 IST

తిరుమలలో భక్తుల రద్దీ.. 50 మందితో బ్రేక్ దర్శనానికి వెళ్లిన మంత్రి

తిరుమలలో కొన్ని రోజులుగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. స్వామి దర్శనానికి 40 గంటలకుపైనే సమయం పడుతోంది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయితే.. రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లారు. 50 మంది అనుచరులతో కలిసి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.

15 August 2022, 13:39 IST

తెల్దారుపల్లిలో ఉద్రిక్తత

టిఆర్‌ఎస్‌ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి సోదరుడి వరుసయ్యే కృష్ణయ్యను ప్రత్యర్థులు హతమార్చారు. ఈ హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని ఆరోనపిస్తూ అతని నివాసంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సిపిఎంతో విభేదాలతు తమ్మినేని వీరభద్రం సోదరులతో కృష్ణయ్యకు వివాదాలు ఉండటంతోనే హత్య జరిగినట్లు చెబుతున్నారు. 

15 August 2022, 13:12 IST

హత్యకు గురైన తమ్మినేని సోదరుడు

సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  వీరభదరం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారు.  ఖమ్మం జిల్లా బెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల సిపిఎం నేతలతో విభేదించిన కృష్ణయ్య టిఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు.  తమ్మినేని కృష్ణ‍య్య టిఆర్‌ఎస్‌ నేతలతో కలిసి సిపిఎంకు వ్యతిరేకంగా  పనిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో  ప్రత్యర్థులు హత్య చేసినట్లు చెబుతున్నారు. 

15 August 2022, 13:09 IST

బండి సంజయ్‌ యాత్రలో ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగాం జిల్లా దేవరుప్పల గ్రామంలో నిర్వహిస్తున్న సభలో టీఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ విమర్శలు చేయడంతో  వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి రెండు పక్షాల మధ్య ఘర్షణగా మారింది. బీజేపీ కార్యకర్తలపై  టిఆర్ఎస్‌ శ్రేణులు విరుచుకుపడటంతో పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను  తగులబెట్టారు.  టిఆర్‌ఎస్‌ దాడులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

15 August 2022, 11:37 IST

కేంద్రంపై కేసీఆర్‌ నిప్పులు

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల సమాహారమే దేశమనే సంగతిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని,  రాష్ట్రాల ప్రయోజనాలను  దెబ్బతీసేలా  పన్నుల్లో వాటాలు ఎగ్గొట్టడానికి  సెస్సుల విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. 

15 August 2022, 10:22 IST

గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన కేసీఆర్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొడ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు  గోల్కొండ కోటను అందంగా ముస్తాబు  చేశారు. భారత దేశ స్వేచ్ఛ సార్వభౌమత్వాలకు 75ఏళ్ల నిండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం చేశారు. కోటి 20లక్షల జెండాలను తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ  చేసినట్లు తెలిపారు. యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితమై మెరిసి మురిసిపోతుందన్నారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను  నేటి తరానికి తెలియచేసే లక్ష్యంతో 15రోజుల పాటు ఉత్సవాలను వజ్రోత్సవ వేడుకలను జరుపుతున్నట్లు తెలిపారు.

15 August 2022, 9:37 IST

ఏపీ అసెంబ్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీలో  జాతీయ జెండాను  స్పీకర్ తమ్మినేని సీతారం ఆవిష్కరించారు.  శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఏపీ సచివాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి.  సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో  జాతీయ జెండాను  సీఎస్ సమీర్ శర్మఆవిష్కరించారు. 

15 August 2022, 9:37 IST

శ్రీశైలంలో వరద ఉధృతి

శ్రీశైలం జలాశయాని వరద ఉధృతి కొనసాగుతోంది.  జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  జలాశయం ఇన్ ఫ్లో 3,79,455 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 3,81,142 క్యూసెక్కులుగా ఉంది.  జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.60 అడుగులకు  నీటిమట్టం చేరింది.  పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలలో ప్రస్తుతం 213.4011 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.  శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

15 August 2022, 9:37 IST

విశాఖ స్టీల్‌ ప్లాంటు ఎదుట ఆందోళన

స్వాతంత్య్ర దినోత్సవ వేళ విశాఖపట్నం కూర్మన్నపాలెంలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నారు.   ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల దీక్ష చేపట్టారు.    ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ దీక్ష చేస్తున్నారు. 

15 August 2022, 9:37 IST

ప్రగతి భవన్‌లో  వజ్రోత్సవ వేడుకలు

దేశానికి స్వాతంత్య్రం  సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, 'స్వతంత్ర భారత వజ్రోత్సవ' వేడుకల్లో భాగంగా  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సిఎంఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

15 August 2022, 9:37 IST

విజయవాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  సీఎం జగన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సాయుధ బలగాలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌,  స్కౌట్స్‌, ఏపిఎస్పీ, సివిల్ పోలీస్‌ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి వచ్చారు.  వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు.   రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించే  శకటాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన వాటిని ప్రదర్శించారు.

    ఆర్టికల్ షేర్ చేయండి