August 20 Telugu News Updates : ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక - కేసీఆర్
20 August 2022, 22:20 IST
- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయయమూర్తి ఎన్వీరమణ విజయవాడలో పర్యటిస్తున్నారు ఉదయం 9.30 గంటలకు కొత్తగా నిర్మించిన కోర్టు భవనాల కాంప్లెక్స్‌ను సీజేఐ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, హైకోర్టు సీజే, అధికారులు పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు నాగార్జున వర్సిటీలో సీజేఐకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సీకే కన్వెన్షన్ లో సీజేఐకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనుంది.
వరవరరావుకు ఎదురుదెబ్బ…
ఎన్‌ఐఏ కోర్టులో విరసం నేత వరవరరావు కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని… కోర్టు తోసిపుచ్చింది. ముంబై విడిచి వెళ్లొద్దని ఎన్‌ఐఏ ప్రత్యేకకోర్టు ఆదేశించింది.
సీజేఐ ఎన్వీ రమణకు విందు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ల గౌరవార్థం ఏపీ ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు.
బతుకుదెరువు ఎన్నిక - కేసీఆర్
మునుగోడులో వచ్చింది ఉప ఎన్నిక కాదని… బతుకుదెరువు ఎన్నిక అన్నారు కేసీఆర్. ఇలాంటి ఎన్నికలో మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పగించవద్దని కోరారు.
మీటరు పెడుతారు - కేసీఆర్
మునుగోడు బీజేపీ ఓటు వేసి గెలిపిస్తే బావుల దగ్గర మీటర్లు పెడుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారికి గతంలో డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. మోదీకి భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
అమిత్ షా సమాధానం చెప్పాలి - కేసీఆర్
కృష్ణా జలాల విషయంలో కేంద్ర వైఖరెంటో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై రేపు మునుగోడుకు వచ్చే అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఎవర్ని ఉద్ధరించేందుకు - కేసీఆర్
మునుగోడులో తలపెట్టిన ప్రజా దీవెన సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. నల్గొండ నగారా పేరుతో ఫ్లొరైడ్ సమస్యపై జిల్లా మొత్తం తిరిగానని గుర్తు చేశారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎవర్ని ఉద్ధరించేందుకు అని ప్రశ్నించారు. దేశంలో ప్రగతి శీల భావాలు కలిగిన వారితో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
గోల్ మాల్ ఉప ఎన్నిక - కేసీఆర్
'నాడు నల్గొండ జిల్లా మొత్తం తిరిగాను. ఫ్లొరైడ్ సమస్యను నాడు ఎవరు పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ప్లొరైడ్ పేరుతో మంచినీళ్లను అందిస్తున్నాం. ఇక్కడ గోల్ మాల్ ఉప ఎన్నిక వచ్చింది. మరో ఏడాది ఎన్నికలు ఉండగానే.. ఉప ఎన్నికను తీసుకొచ్చారని అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సభ వద్దకు కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు చేరుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న ఆయన…కాసేపట్లో సభపైకి రానున్నారు.
సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడుకు బయల్దేరారు. భారీ కాన్వాయ్ తో ఆయన సభకు చేరుకోనున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్ రాకతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యార్ధుల్లో సామాజిక స్పృహ కొరవడుతోంది….
యూనివర్శిటీలలో చదివే విద్యార్ధుల్లో సైతం సామాజిక స్పృహ కొరవడుతోందని, ఒకప్పటి వాతావరణం యూనివర్శిటీలలో లేదని, సామాజిక అంశాలపై విద్యార్ధులు చర్చల్లో పాల్గొనకపోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు.
మునుగోడు బయల్దేరిన సీఎం కేసీఆర్
మునుగోడులో టిఆర్‌ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు వెళుతున్నారు. సాయంత్రం మూడున్నర, నాలుగు గంటల సమయంలో కేసీఆర్ మునుగోడు చేరుకోనున్నారు.
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలో బీజేపీ యువ సంఘర్షణ యాత్ర
రేపు విజయవాడలో బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ హాజరు కానున్నారు. కానుకలతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 173 నియోజకవర్గాల్లో యువమోర్చా యాత్ర చేసిందని, యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఎయిమ్స్ వంటి సంస్థను కేంద్రం ఏపీకి ఇచ్చినా వాటిని ఏపీ సరిగా వినియోగించుకోలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
ఏపీని కేంద్రం ఆదుకోవాలన్న సీజేఐ
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆర్ధికంగా ఆదుకోవాల్సిన అవసరముందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోడానికి కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కోర్టు కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీజేఐ
విజయవాడలో నూతనంగా నిర్మించిన భారీ కోర్టు కాంప్లెక్స్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నెల్లూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు
నెల్లూరు వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్‍కుమార్‍కు పోటీగా మరో కార్యాలయం ఏర్పాటవుతోంది. డి ప్యూటీ మేయర్ రూప్‍కుమార్ మరో కార్యాలయాన్ని జేమ్స్ గార్డెన్‍లో ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా నిర్మించబోయే భవనానికి జగనన్న భవన్‍గా పేరు పెట్టాలని యోచిస్తున్నారు. అనిల్ పోటీ చేయకుంటే సిటీ ఉంచి పోటీ చేసే యోచనలో రూప్‍కుమార్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
రోడ్డెక్కిన తాడికొండ వైసీపీ రాజకీయాలు
తాడికొండ వైసీపీ అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‍ను నియమించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు భగ్గుమంటున్నారు. వైసీపీ అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి సుచరిత ఇంటి వద్ద ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఆందోళనకు దిగారు. దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించారని ఆరోపిస్తున్నారు. శ్రీదేవి అనుచరుల ఆందోళన నేపథ్యంలో మాజీ మంత్రి సుచరిత ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
సీఎంకు ఆర్టీసి ఉద్యోగుల వినతి పత్రాలు
పీఆర్సీ అమలుతో పాటు అపరిష్కృత డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసి ఉద్యోగులు సీఎం జగన్ కు వినతిపత్రాలు పంపాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీకి మరోసారి వినతిపత్రం ఇవ్వనున్నారు. రేపట్నుంచి 28 వరకు సీఎంకు వినతిపత్రాలు పంపాలని ఉద్యోగులు నిర్ణయించారు. సంతకాల సేకరణ అనంతరం సీఎంకు ఆర్టీసీ ఉద్యోగుల వినతిపత్రాలు సమర్పిస్తారు. పీఆర్సీ అమలు సహా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది.
ఎమ్మెల్యే అల్లుడి ఆత్మహత్య
తాడేపల్లి మండలం కుంచనపల్లిలో, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని మంజునాథరెడ్డి బలవన్మరణం పాలయ్యారు. ఆర్ధిక ఇబ్బందులు, కాంట్రాక్టు పనుల బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చింది. శ్రీవారిని 64,438 మంది భక్తులు దర్శించుకోగా, 34,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
కార్పొరేటర్లకు కష్టాలు
అధ్యయన యాత్రకు వెళ్లిన జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం, కొండచరియలు విరిగిపడటంతో మనాలి-చండీగఢ్ రహదారిలో చిక్కుకుపోయారు. అర్ధరాత్రి నుంచి బస్సులోనే మనాలి సమీప రహదారిలో కార్పొరేటర్ల అవస్థలు పడుతున్నారు. మనాలిలో బసకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ల బృందం కోరినా ప్రయాణం కొనసాగించాలని జీవీఎంసీ అధికారులు పట్టుబట్టారని కార్పొరేటర్లు ఆరోపించారు. జీవీఎంసీ అధికారుల తీరుపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.