తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur News : ఐవీఎఫ్ ఆపరేషన్ వికటించి మహిళ మృతి, బతికే ఉందని ఆసుపత్రి సిబ్బంది డ్రామా

Anantapur News : ఐవీఎఫ్ ఆపరేషన్ వికటించి మహిళ మృతి, బతికే ఉందని ఆసుపత్రి సిబ్బంది డ్రామా

23 August 2023, 14:38 IST

google News
    • Anantapur News : సంతానం కలిగేందుకు ఆపరేషన్ చేస్తామంటూ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.
ఆపరేషన్ వికటించి మహిళ మృతి
ఆపరేషన్ వికటించి మహిళ మృతి

ఆపరేషన్ వికటించి మహిళ మృతి

Anantapur News : ఠాగూర్ సినిమాలో మృతదేహానికి చికిత్స చేసి డబ్బులు వసూలు చేసిన సీన్ గుర్తుందా? ఇలాంటి ఘటనే ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది. చనిపోయిన మహిళకు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది డ్రామా ఆడారు. సీన్ లోకి పోలీసులు ఎంటరయ్యేటప్పటికీ అసలు విషయం బయటపడింది.

అసలేం జరిగింది?

అనంతపురం జిల్లా పీసీప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామికి కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్‌బీ (32)కి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి చాలా ఏళ్లుగా సంతానం లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి గైనకాలజిస్టును సంప్రదించిగా ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మించారు. వైద్యులు చెప్పినట్లు చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. వివిధ టెస్టులు చేస్తూ మూడు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మంగళవారం మోదీన్‌బీకి సర్జరీ చేసేందుకు వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లిన ఏదో మందు ఇవ్వగా అది వికటించి మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిందని తెలిస్తే కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తారని ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేస్తున్నట్లు నాటకం ఆడారు. మోదీన్‌బీకి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బెంగళూరుకు తీసుకొని వెళ్లాలని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పింది. మహిళ బతికే ఉందని డ్రామా ఆడుతూ ఆక్సిజన్‌ను కృత్రిమంగా పంపింగ్‌ చేశారు. నాలుగు గంటల పాటు ఆ మహిళ మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆపరేషన్‌ థియేటర్‌లో నాటకం ఆడారు.

బంధువుల ఆందోళన

చివరకు రాత్రి 7:45 గంటలకు పోలీసులను పిలిపించి మహిళ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు. మృతురాలు గుత్తి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతిచెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఐసీయూలో పరికరాలు పగలగొట్టారు. మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. చివరికి సీఐలు, ఎస్సైలు కల్పించుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఆసుపత్రిని సీజ్‌ చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

కడుపులో దూది మర్చిపోయి కుట్లు

తెలంగాణ నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మరణించారు. దర్శన్‌గడ్డ తండాకు చెందిన గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసిన వైద్యులు, మహిళ కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేసేశారు. అనంతరం మహిళను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మంగళవారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు మహిళను హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని బుధవారం అచ్చంపేటకు తీసుకుని వచ్చిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

తదుపరి వ్యాసం