Anantapur Accident : వ్యవసాయ కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఏడుగురి మృతి-సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
23 November 2024, 20:03 IST
Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 5 గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లె గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా, మార్గమధ్యలో మరో ఇద్దరు, ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు.
కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వారి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంజమనమ్మ, బాల గద్దయ్య, డి.నాగమ్మ, నాగమ్మ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కూలీలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని ఎస్పీ, డీఎస్పీ పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం....ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రులు సూసైడ్
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల భారమే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని పాత పోలీసు స్టేషన్ మెయిన్ సంత బజార్ వద్ద ఉన్న పెద్దమ్మ స్వామి గుడి వద్ద గురువారం వెలుగు చూసింది. అక్కడ కృష్ణకిషోర్ (45), శిరీష (35) నివాసిస్తున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉన్నారు. నార్పల గూగూడు రోడ్డులో కృష్ణ కిశోర్ మెడికల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. షాప్ నిర్వహణ కోసం అప్పులు చేసినట్లు తెలిసింది. షాపు నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దీంతో ఆదాయం లేకపోవడంతో అప్పులు తీరే దారి లేకపోయింది. దీంతో భార్యాభర్తలు మదనపడుతూ ఉన్నారు. ఆత్మహత్య శరణ్యమని భావించి నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గత నాలుగు రోజుల నుంచి కృష్ణ కిశోర్ ఇంటి తలుపులు మూసి ఉండడం, మృతదేహాల కుళ్లిపోయి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తే భార్యాభర్తలిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించారు. ఐదు నెలల కుమార్తె ఊయ్యాలలో విగత జీవిగా పడి ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వేలాడుతున్న మృతదేహాలను పోలీసులు దింపారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.