IDBI Bank Robbery : అనంతపురం ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షలు చోరీ, ఉద్యోగే సూత్రధారి!
20 December 2023, 15:31 IST
- IDBI Bank Robbery : అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఐడీబీఐ బ్యాంకు చోరీని పోలీసులు ఛేదించారు. 12 గంట్లోలనే నిందితులను పట్టుకున్నారు. క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీస్ ఏజెంట్ గాని పనిచేస్తు్న్న వ్యక్తే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
ఐడీబీఐ బ్యాంకులో చోరీ
IDBI Bank Robbery : అనంతపురం జిల్లాలో కలకలం రేపిన ఐడీబీఐ బ్యాంక్ చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ ఇంటి దొంగ పనేనని గుర్తించారు. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఏజెంట్ గా పనిచేస్తున్న పోతురాజే చోరీకి పాల్పడ్డిన పోలీసులు నిర్ధారించారు. పోతురాజు తన స్నేహితులతో కలిసి ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షలు చోరీ చేసినట్లు ఎస్పీ అన్భురాజన్ తెలిపారు. ఏటీఎం ఏజెంట్ పనిచేస్తున్న పోతురాజు డబ్బు కాజేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేసినట్లు విచారణలో తెలిసిందనన్నారు.
అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఐడీబీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో నలుగురు నిందితులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 46 లక్షల నగదు చోరీ చేశారు. క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీస్ ఏజెంట్ పోతురాజుపై దాడి చేసి, అతడిని నిర్భందించి నగదు దోచుకెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులకు డబ్బు కోసం బ్యాంకు ఉద్యోగి పోతురాజే చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు.
చోరీ డ్రామా
ఐడీబీఐ బ్యాంకు నుంచి డబ్బు తీసుకువస్తున్న సమయంలో దుండగులు తనపై దాడి చేసి డబ్బు దోచుకెళ్లారని పోతురాజు డ్రామా ఆడాడు. పోతురాజు చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని విచారించారు. స్నేహితులతో కలిసి ఏటీఎం ఏజెంట్ పోతురాజు చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 46 లక్షల నగదు, రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై ఆశతో పోతురాజు ఈ చోరీకి ప్లాన్ చేశాడని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో చోరీలు-వృద్ధురాలు అరెస్ట్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు నిద్రపోతున్న వేళ వారి నగలు చోరీ చేస్తున్న ముత్యాలమ్మ అనే వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేసారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముత్యాలమ్మ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నగలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. ఇటీవల బస్సుల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. చోరీలకు పాల్పడుతున్న ముత్యాలమ్మను అరెస్ట్ చేశారు. ముత్యాలమ్మపై విజయవాడలోనే కాకుండా 6 జిల్లాల పరిధిలో పదుల సంఖ్యలో చోరీ కేసులున్నట్లు గుర్తించారు. ఆమెపై మొత్తం 50కి పైగా కేసులు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. ముత్యాలమ్మ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సేదతీరాల్సిన వయసులో చోరీలకు పాల్పడున్న ముత్యాలమ్మను చూసి పోలీసులే అవాక్కైయ్యారు.