తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Constable Rape Case: నేరం ఒకరిది,శిక్ష మరొకరికి.. కానిస్టేబుల్ కేసులో కీలక మలుపు

Constable Rape Case: నేరం ఒకరిది,శిక్ష మరొకరికి.. కానిస్టేబుల్ కేసులో కీలక మలుపు

HT Telugu Desk HT Telugu

31 August 2023, 9:30 IST

google News
    • Constable Rape Case: చేయని తప్పుకు పోలీస్ కానిస్టేబుల్ యాభై రోజులుగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. అత్యాచారం ఆరోపణలతో అరెస్టైన  కానిస్టేబుల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. నిందితుడిని మరో వ్యక్తిగా కోర్టు విచారణలో గుర్తించారు. 
కీలక మలుపు తిరిగిన కానిస్టేబుల్ అత్యాచారం కేసు
కీలక మలుపు తిరిగిన కానిస్టేబుల్ అత్యాచారం కేసు

కీలక మలుపు తిరిగిన కానిస్టేబుల్ అత్యాచారం కేసు

Constable Rape Case: అనంతపురంలో బాలికపై అత్యాచారం కేసులో అరెస్టైన కానిస్టేబుల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇంటి పనుల కోసం పనిలో పెట్టుకున్న బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేయడంతో ఆమె గర్బం దాల్చిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు విచారణలో నిందితుడు కానిస్టేబుల్ కాదని తేలడంతో అంతా అవాక్కయ్యారు. మేజిస్ట్రేట్‌కు వాంగ్ములం ఇచ్చే సమయంలో నిందితుడు మరో యువకుడని బాలిక స్పష్టం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

అనంతపురంలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని గ్రామ వాలంటీర్‌గా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి తప్పించుకు తిరుగుతున్న వాలంటీరును అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్‌ జైలుపాలయ్యాడు.

అనంతపురం జిల్లా గుత్తి మండలానికి చెందిన రమేష్‌ అనంతపురం టూటౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య కూడాప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను రెండేళ్ల క్రితం ఇంట్లో పనికి పెట్టుకున్నారు.

జులై 5న బాలిక కానిస్టేబుల్‌ తనపై కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, ఒకసారి తనకు గర్భస్రావం చేయించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కానిస్టేబుల్‌ రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలిని పోలీసులు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. ఆ సమయంలో బాధితురాలు అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజశేఖర్‌ పేరు బయటపెట్టింది. బాలిక పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న నిందితుడు గ్రామంలోనే వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బాలిక ఉండే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల కోసం వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి ప్రేమిస్తున్నానంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయమూర్తికి తెలిపింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో గట్టిగా నిలదీశారు. దీంతో నెపాన్ని కానిస్టేబుల్‌పై నెట్టేసింది.

బాలిక స్వగ్రామంలో జరిగిన గొడవ విషయంలో ఒక వర్గానికి కానిస్టేబుల్‌ రమేశ్‌ అండగా నిలబడటంతో గ్రామానికి చెందిన పలువురు రమేష్ మీద ద్వేషం పెంచుకున్నారు. అదే సమయంలో బాలికపై అత్యాచారం విషయం వెలుగు చూడడంతో, బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేసి కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయించారు.

మేజిస్ట్రేటుకు ఇచ్చిన వాంగ్మూలంలో లు నిందితుడు గ్రామ వాలంటీరు రాజశేఖర్‌ అని తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రమేష్ యాభై రోజులు జైలు పాలయ్యాడు. మరోవైపు సాంకేతిక ఆధారాలు సేకరించేందుకు బాలికకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.బాలికతో తప్పుడు ఫిర్యాదు చేయించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.

తదుపరి వ్యాసం