తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Floods : తెలుగు రాష్ట్రాలకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ టీమ్‌..! వరద నష్టంపై అంచనా వేయనున్న కేంద్ర బృందాలు

AP TG Floods : తెలుగు రాష్ట్రాలకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ టీమ్‌..! వరద నష్టంపై అంచనా వేయనున్న కేంద్ర బృందాలు

HT Telugu Desk HT Telugu

07 September 2024, 8:44 IST

google News
    • ఏపీ, తెలంగాణ‌కు కేంద్ర బృందాలు రానున్నాయి.రెండు రాష్ట్రాల‌కు అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను త్వరలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదలు..!
తెలుగు రాష్ట్రాల్లో వరదలు..! (image source Twitter)

తెలుగు రాష్ట్రాల్లో వరదలు..!

వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోంద‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు శుక్ర‌వారం ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌క‌టించారు. వరద సాయం, సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు అవసరమైన, సకాలంలో సహాయాన్ని కేంద్రం అందజేస్తోందని అన్నారు.

రెండు రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాలను త్వరలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బృందం సందర్శిస్తుందని తెలిపారు. ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బృందం నష్టంపై అక్కడికక్కడే అంచనా వేస్తుందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన 26 బృందాలు, భారత వైమానిక దళానికి చెందిన ఎనిమిది హెలికాప్టర్లు, మూడు హెలికాప్టర్లు, భారత నావికాదళానికి చెందిన ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించిన‌ట్లు హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు.

“హోం మంత్రి ఆదేశాల మేరకు వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత, తక్షణ ఉపశమనం కోసం సిఫార్సులు చేయడం వంటి అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని విజయవాడ (ఆంధ్రప్రదేశ్) కోసం పంపించిన‌ట్లు” జిందాల్ చెప్పారు.

తెలంగాణలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఏడు బృందాలు, ఐఏఎఫ్‌కి చెందిన రెండు హెలికాప్టర్లను కూడా సమీకరించినట్లు ఆయన తెలిపారు. "సహాయ చర్యలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన అన్ని ర‌కాల‌ సహాయాన్ని స‌కాలంలో అందిస్తోంద‌ని అన్నారు. సెప్టెంబరు 1 రాత్రి అనేక ప్రాంతాలలో వరదలు ప్రభావితమైనప్పుడు… కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడానికి అదనపు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్‌) హెలికాప్టర్లను సమీకరించినట్లు ఆయన చెప్పారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటివరకు 350 మందిని రక్షించాయ‌ని విరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 15,000 మందిని తరలించాయ‌ని, తెలంగాణలో 68 మందిని రక్షించాయ‌ని, సుమారు 3,200 మందిని తరలించాయ‌ని తెలిపారు. ఇప్పటికే అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేశామని… త్వరలో రెండు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టంపై అక్కడికక్కడే అంచనా వేయనున్నట్లు తెలిపారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) నుండి అదనపు ఆర్థిక సహాయం కోసం కేంద్ర బృందం హోం మంత్రిత్వ శాఖకు తన సిఫార్సులను చేస్తుంద‌ని తెలిపారు. ఐఏఎఫ్‌, నేవీ హెలికాప్టర్లు 65 సోర్టీలను నిర్వహించాయ‌ని, ఆంధ్రప్రదేశ్‌లోని బాధిత జనాభా కోసం సుమారు 71,000 కిలోగ్రాముల ఆహారం, సహాయక సామగ్రిని అందించాయ‌ని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ కూడా సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లను పర్యవేక్షించడానికి సందర్శించారని తెలిపారు.

మ‌రోవైపు కేంద్ర వ్య‌వసాయ‌, రైతు సంక్షేమ శాఖ విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో ఎస్‌డీఆర్ఎఫ్ ఖాతాలో కేంద్ర వాటాతో స‌హా రాష్ట్ర వ‌ద్ద ఉన్న రూ.3,448 కోట్ల‌ను వాడుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించిన‌ట్లు తెలిపింది. ఏపీ, తెలంగాణ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి స‌హ‌కారం అందిస్తుంద‌ని తెలిపింది. త‌క్ష‌ణ సాయం అందించిన త‌రువాత రైతుల‌కు త‌దుప‌రి పంట‌కు ఎరువులు, విత్త‌నాలు ఎలా అందిస్తాయో ప్ర‌భుత్వం ఆలోచిస్తుంద‌ని, రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం కృషి చేస్తున్నామ‌ని తెలిపింది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం