తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gudivada Amarnath : సీఎం సీట్లో కూర్చొన్న మంత్రి అమర్నాథ్, అది కేవలం చైర్ కాదు హోదా అంటూ ధూళిపాళ్ల ట్వీట్

Gudivada Amarnath : సీఎం సీట్లో కూర్చొన్న మంత్రి అమర్నాథ్, అది కేవలం చైర్ కాదు హోదా అంటూ ధూళిపాళ్ల ట్వీట్

14 February 2024, 22:46 IST

google News
    • Gudivada Amarnath : సచివాలయం ఒకటో బ్లాక్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఈ ఘటనపై టీడీపీ వ్యంగ్యంగా స్పందించింది.
సీఎం సీట్లో కూర్చొన్న మంత్రి అమర్నాథ్
సీఎం సీట్లో కూర్చొన్న మంత్రి అమర్నాథ్

సీఎం సీట్లో కూర్చొన్న మంత్రి అమర్నాథ్

Gudivada Amarnath : రాష్ట్రంలో రూ.4,883 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ సహా పలు సంస్థల పరిశ్రమలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సచివాలయం ఒకటో నంబర్ బ్లాక్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్లాక్ లో ముఖ్యమంత్రి తప్ప ఇతర మంత్రుల ప్రోగ్రామ్స్ నిర్వహించరు. కానీ సచివాలయంలో ఒకటో బ్లాక్ లో సీఎం కుర్చీలో కూర్చుని మంత్రి అమర్నాథ్ రివ్యూ నిర్వహించారు. ఈ ఘటనపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇవాళ పలు పరిశ్రమలకు సీఎం జగన్ వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేయాలి. కానీ సీఎం రాకపోవడంతో ఆయన స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రి అమర్నాథ్ సీఎం సీట్లో కూర్చొన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు. పోటీకి సీటు ఇవ్వలేదని... సెక్రటేరియట్ కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం చైర్ కాదు...అదొక హోదా! వీళ్లకు అర్థం కాదు....వీళ్ల పోకడలకు అర్థం లేదు" అని ధూళిపాళ్ల ట్వీట్ చేశారు.

సాధారణంగా సీఎం తప్ప ఒకటో నంబర్ బ్లాక్ లో మంత్రుల ప్రోగ్రామ్స్ ఉండవని తెలుస్తోంది. మిగిలిన నాలుగు బ్లాక్స్ లోని వేర్వేరు కాన్ఫరెన్స్ హాల్స్ లో మంత్రుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అధికారులు. పెద్ద ప్రోగ్రామ్స్ కు నిర్వహించే సమయంలో సచివాలయంలోని 5వ బ్లాక్ హాల్ ను వినియోగిస్తుంటారు. అయితే మంత్రి అమర్నాథ్ ఇవాళ నిర్వహించిన రివ్యూలో సీఎం చైర్ లో కూర్చొన్నారు. అధికారుల సమాచారం లోపంతో ఇలా జరిగిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వర్చువల్ శంకుస్థాపనలు

రిలయన్స్ గ్రూప్, ఆదిత్య బిర్యా సంస్థ ఏపీలో భారీగా పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు ఏపీలో 4883 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ కంపెనీల కార్యక్రమాలు మండ్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్ ప్రారభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపించినా ఈ స్థాయిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం సీఎం జగన్ ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సుమారు రూ. 1,024 కోట్లతో పలు జిల్లాల్లో బయో ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సిద్ధమైంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో గ్యాస్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది రిలయన్స్. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. వీటితో 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

తదుపరి వ్యాసం