AP TET 2024 : రెండ్రోజుల్లో ఏపీ టెట్ నోటిఫికేషన్, ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరణ!
30 January 2024, 14:46 IST
- AP TET 2024 : ఏపీలో మరో రెండు, మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టత రానుంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఏపీ టెట్ నోటిఫికేషన్
AP TET 2024 : ఏపీలో తర్వలో డీఎస్సీ, టీచర్ ఎలిజిబిలిట్ టెస్ట్(TET) నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా దాదాపూ 6 వేల పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం. అయితే డీఎస్సీ, టెట్ పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రేపు(జనవరి 31) జరిగే కేబినెట్ భేటీలో డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది. కేబినెట్(AP Cabinet) ఆమోదం తర్వాత డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు, షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా టెట్ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించనున్నారని తెలుస్తోంది. దరఖాస్తుల ఆధారంగా టెట్ షెడ్యూల్(AP TET Syllabus) నిర్ణయించనున్నారు. టెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ(DSC 2024) కి అప్లికేషన్లు స్వీకరణ, పరీక్షల నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.
టెట్ అర్హతలు
ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో
గతంలో ఎస్జీటీ(SGT) పోస్టులకు బీఈడీ(B.Ed) చేసిన వాళ్లు కూడా అర్హులు అవుతారని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి చెప్పింది. అందుకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హులయ్యారు. కానీ గతేడాది ఈ నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంగా బీఈడీ చేసినవాళ్లకు ఎస్జీటీ పోస్టులకు రాసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్(AP Govt) కూడా ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.