తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Notification : ఏపీ డీఎస్సీపై మరో అప్డేట్, పది వేల పోస్టులతో వారంలో నోటిఫికేషన్?

AP DSC Notification : ఏపీ డీఎస్సీపై మరో అప్డేట్, పది వేల పోస్టులతో వారంలో నోటిఫికేషన్?

23 January 2024, 17:13 IST

google News
    • AP DSC Notification : మరో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

AP DSC Notification : ఏపీ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే గ్రూప్-1,2 నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు శాఖాపరమైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో సుమారు 6 వేల నుంచి 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ పై సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 18,500 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

దశల వారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ

సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇటీవల ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డీఎస్సీ గురించి ఇప్పుటికే సీఎం జగన్ తో చర్చించామన్నారు. త్వరలో వివరాలను తెలియజేస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే సీఎం డీఎస్సీపై చర్చించామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనే డీఎస్సీ ప్రక్రియ ముందుకు సాగనుంది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఈ నెలలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దశల వారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరిలో తెలంగాణ డీఎస్సీ పరీక్ష

తెలంగాణ డీఎస్సీ పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. తెలంగాణలో డీఎస్సీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల కారణంగా డీఎస్సీ రాత పరీక్ష వాయిదా పడింది. గత ఏడాది సెప్టెంబర్ 8న తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మరోసారి అభ్యర్థులు ప్రిపరేషన్ ముమ్మరం చేశారు.

తదుపరి వ్యాసం