AP Pension Hike : ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్, జనవరి 1 నుంచి పెంచిన పింఛన్లు పంపిణీ
31 December 2023, 21:00 IST
- AP Pension Hike : ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3న కాకినాడలో పింఛన్ పెంపు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
సీఎం జగన్
AP Pension Hike : పింఛన్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుకను మరో రూ.250 పెంచి రూ.3 వేలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి 8 వరకు పింఛన్ పంపిణీపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 3వ తేదీన సీఎం జగన్ కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో నిర్వహించే పింఛన్ కానుక పెంపు కార్యక్రమం పాల్గొంటారు.
జనవరి 3న కాకినాడలో సీఎం జగన్ పర్యటన
పింఛన్ కానుక కింద ప్రస్తుతం రూ.2750 ఇస్తున్నారు. ఈ పింఛన్ ను రూ.3 వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని జనవరి 3న కాకినాడలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. అదే రోజు కలెక్టరేట్‌లలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
సీఎం జగన్ బహిరంగ లేఖ
ఏపీలో పెన్షన్లు రూ.3 వేలకు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్దిదారులకు సీఎం జగన్ బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ డబ్బులతో పాటు ఈ లేఖలను వాలంటీర్లు పింఛన్ దారులకు అందించనున్నారు.
"ప్రియమైన అవ్వాతాతలకు.. మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 జనవరి 1 నుంచి మీ చేతికి అందే పెన్షన్ రూ.3000 అవుతుంది. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు పెన్షన్‌లను పెంచుకున్నాం. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం రూ. వెయ్యి ఉండేది. గతంలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి రూ.58 వేలు పింఛన్ ఇచ్చారు. అదే వైసీపీ పాలనలో పెన్షన్ ఏకంగా రూ.1.47 లక్షలు ఇచ్చాం. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ రూ.1.67 లక్షలు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్‌లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడు 66 లక్షలకు చేరిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను"- సీఎం జగన్