తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fibernet Case : ఫైబర్ నెట్ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు- ఏపీ ప్రభుత్వం, చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచన

AP Fibernet Case : ఫైబర్ నెట్ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు- ఏపీ ప్రభుత్వం, చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచన

12 December 2023, 17:40 IST

google News
    • AP Fibernet Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. స్కిల్ కేసులో తీర్పు తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసు
ఏపీ ఫైబర్ నెట్ కేసు

ఏపీ ఫైబర్ నెట్ కేసు

AP Fibernet Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 17కు వాయిదా పడింది. అయితే ఈ కేసుకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఏపీ ప్రభుత్వం, చంద్రబాబును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఫైబర్ నెట్ కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే చంద్రబాబు తనను జైలుకు పంపిన విషయాలపైనే మాట్లాడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.

చంద్రబాబు నిబంధనలు పాటిస్తున్నారు

చంద్రబాబు కోర్టు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ, సీఐడీ డీజీ దిల్లీ సహా పలు ప్రాంతాల్లో మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. కేసు విచారణ స్థాయిలో ఉన్నప్పుడు మీడియా సమావేశాల్లో చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేశారని కోర్టుకు తెలిపారు. వాటితో పోలిస్తే చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కోర్టుకు తెలిపారు.

స్కిల్ కేసులో తీర్పు తర్వాతే విచారణ

అయితే స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో 17ఏ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే ఫైబర్ నెట్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్‌ లో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేస్తుంది.

ఫైబర్ నెట్ కేసు

ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సిట్‌ దర్యాప్తులో ఈ విషయం తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని సీఐడీ తెలిపింది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు సీఐడీ అభియోగిస్తోంది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్‌ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్టారని సీఐడీ ఆరోపిస్తుంది. టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకంగా వ్యవహరించారని, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని సీఐడీ అధికారులు అభియోగిస్తున్నారు.

తదుపరి వ్యాసం