తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : గూగుల్ చేస్తే తెలిసే ప్రశ్నలు అడిగారు, సీఐడీ విచారణపై లోకేశ్ కామెంట్స్

Nara Lokesh : గూగుల్ చేస్తే తెలిసే ప్రశ్నలు అడిగారు, సీఐడీ విచారణపై లోకేశ్ కామెంట్స్

10 October 2023, 19:28 IST

google News
    • Nara Lokesh : వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. గూగుల్ చేస్తే తెలిసే విషయాలను సీఐడీ అధికారులు అడిగారన్నారు. రేపు మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు.
 నారా లోకేస్
నారా లోకేస్

నారా లోకేస్

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను సీఐడీ విచారించింది. మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం సీఐడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన లోకేశ్... మీడియాతో మాట్లాడారు. గూగుల్ చేస్తే తెలిసే విషయాలను అడిగారని లోకేశ్ అన్నారు. దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధంలేని 50 ప్రశ్నలు త‌న‌ను అడిగార‌న్నారు. ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో కొడితే వ‌చ్చేవి ఉన్నాయ‌ని లోకేశ్ పేర్కొన్నారు. మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవ‌న్నీ త‌న‌ని విచార‌ణాధికారులు అడిగార‌న్నారు. త‌న ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేద‌ని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిప‌క్షమైనా, ప్రజ‌ల‌నైనా క‌క్ష సాధించ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు.

రేపు మళ్లీ విచారణ

పోల‌వ‌రం ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని, యువ‌త‌కి ఉద్యోగాలు ఎందుకు క‌ల్పించ‌లేద‌ని నిల‌దీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్రమ అరెస్టు చేసి చంద్రబాబుని జైలులో వేశార‌ని లోకేశ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చ‌ర్యేన‌న్నారు. తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా అరాచ‌క స‌ర్కారుపై ప్రజ‌ల్ని చైత‌న్యప‌రుస్తుంటే...ఇదిగో ఇలా త‌ప్పుడు కేసుతో యువ‌గ‌ళం ఆగిపోయేలా చేశార‌ని మండిప‌డ్డారు. ఈ త‌ప్పుడు కేసుల‌న్నీ ప్రజ‌ల్లో ఉంటోన్న తెలుగుదేశం పార్టీని క‌ట్టడి చేయ‌డానికే అన్నారు. తాను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్రల్లో భాగ‌మే ఈ కేసులని ఆరోపించారు. తాను లండ‌న్‌లో ఉన్నప్పుడు త‌న‌కు తెలియ‌కుండా చంద్రబాబు అరెస్టు జ‌రిగింద‌ని జ‌గ‌న్ అంటున్నార‌ని, ఏసీబీ-సీఐడీ సీఎం కింద ప‌నిచేస్తాయ‌నే క‌నీస అవ‌గాహ‌న‌లేని జ‌గ‌న్... డీజీపీ ద‌గ్గర పాఠాలు నేర్చుకోవాల‌న్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెప్పాన‌ని, మళ్లీ రేపు రమ్మని 41ఏ నోటీసు ఇచ్చారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు హాజ‌రు అవుతాన‌ని చెప్పాన్నారు. త‌ప్పు చేయ‌న‌ప్పుడు తానెందుకు భ‌య‌ప‌డాలని లోకేశ్ ప్రశ్నించారు.

కేసుకు సంబంధంలేని ప్రశ్నలు

"ఇది కక్షసాధింపే, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నారు. దొంగ ఎఫ్ఐఆర్, తప్పుడు కేసులు పెడుతున్నారు. రేపు మళ్లీ విచారణకు రమ్మన్నారు...వస్తానన్నాను. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మంత్రుల భేటీలో చర్చకు వచ్చిందా? అనే ప్రశ్న మాత్రమే అడిగారు. ఈ కేసుకు సంబంధంలేని 49 ప్రశ్నలు అడిగారు. పోలవరం, రాజధాని, నిరుద్యోగుల గురించి అడుగుతున్నామనే మాపై దొంగ కేసులు పెట్టారు. సీఐడీ, ఏసీబీ సీఎం కిందే పనిచేస్తాయి. కానీ నాకేం తెలియదని సీఎం అంటున్నారు. సీఎం జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నాకు 41ఏ ఇచ్చారు. చట్టాలు ఉల్లంఘించి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారు. చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చుపెట్టిన వాటిల్లో వైసీపీ ప్రభుత్వం 10 శాతం కూడా ఖర్చుపెట్టలేదు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా? విజిల్ వేస్తే కేసు, క్యాండిల్ ర్యాలీ చేస్తే కేసు, చంద్రబాబుకు మద్దతుగా నిరసన చేస్తే కేసు...2018కి ముందు నాపై కేసులు లేవు. ఇప్పుడు 23 కేసులు పెట్టారు."- లోకేశ్

తదుపరి వ్యాసం