తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Irr Case : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట, నవంబర్ 7కు విచారణ వాయిదా!

Chandrababu IRR Case : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట, నవంబర్ 7కు విచారణ వాయిదా!

18 October 2023, 14:05 IST

google News
    • Chandrababu IRR Case : ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు నవంబర్ 7కు వాయిదా వేసింది.
ఐఆర్ఆర్ కేసు
ఐఆర్ఆర్ కేసు

ఐఆర్ఆర్ కేసు

Chandrababu IRR Case : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో నవంబర్ 7 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఇవాళ్టి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ విచారణను నవంబర్‌ 7కు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. దీంతో ముందస్తు బెయిల్ నవంబర్ 7 వరకు పొడిగించినట్లు అయింది. సుప్రీంకోర్టులో 17ఏ పై విచారణ కొనసాగుతోందని, దీనిపై అనుకూలంగా తీర్పు వస్తే.. ఈ కేసుకు వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ14గా నారా లోకేశ్ ను కూడా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో పాటు ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును విచారణకు సీఐడీ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం తుది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పు రిజర్వ్‌ చేసింది. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పి్స్తామని చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. అయితే సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం ఈ కేసులో తుది తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.

గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు టీడీపీ నేతలు గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు టీడీపీ నేతల బృందానికి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కోర్టుల్లో 17ఏపై వాదనలు జరుగుతున్న క్రమంలో గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ కీలకంగా మారింది. 17ఏ నిబంధనను వైసీపీ ప్రభుత్వం పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేశారని గవర్నర్‌కు వివరించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలు చేస్తున్నా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. టీడీపీ నేతలను అర్ధరాత్రి వరకూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, మరికొంత సీనియర్ నేతలు గవర్నర్ ను కలవనున్నారు.

తదుపరి వ్యాసం