తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Cid Notices : నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ

Lokesh CID Notices : నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ

30 September 2023, 17:47 IST

google News
    • Lokesh CID Notices : టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణ హాజరవ్వాలని కోరింది.
నారా లోకేశ్ కు నోటీసులు
నారా లోకేశ్ కు నోటీసులు

నారా లోకేశ్ కు నోటీసులు

Lokesh CID Notices : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చింది. వాట్సప్ ద్వారా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించింది. నోటీసులు అందినట్లు లోకేశ్ సీఐడీకి వాట్సప్ లో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు వీలుగా దిల్లీకి మకాం మార్చారు. ఆయన ప్రస్తుతం దిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉంటున్నారు. అయితే ముందు వాట్సప్ నోటీసులు పంపిన సీఐడీ అధికారులు… అనంతరం డైరెక్ట్ గా లోకేశ్ కు నోటీసులు అందించారు.

ముందస్తు బెయిల్ తిరస్కరణ

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై గతేడాది సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇటీవల ఏ14గా లోకేశ్‌ పేరును సీఐడీ చేర్చింది. ఈ నేపథ్యంలో లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై సీఐడీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు...లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని సీఐడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ నోటీసులు జారీ చేశారు.

లోకేశ్ పాత్ర కీలకం

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో లోకేశ్‌ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్‌ బృందం గుర్తించింది. సిట్‌ సేకరించిన ఆధారాల్లో.. సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈ మెయిల్‌ సందేశాలు, మ్యాపులు, టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు ఉన్నాయి. కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్‌ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా నాయకుల ప్రమేయాన్ని నిర్ధారించాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈ-మెయిల్స్‌ పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోకేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సూచించారు.

తదుపరి వ్యాసం