తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Exam Fee : టెన్త్ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

AP SSC Exam Fee : టెన్త్ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

28 October 2023, 8:57 IST

google News
    • AP SSC Exam Fee : ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 లోపు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ తెలిపారు.
పదో తరగతి పరీక్షల ఫీజు
పదో తరగతి పరీక్షల ఫీజు

పదో తరగతి పరీక్షల ఫీజు

AP SSC Exam Fee : ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ విడుదలైంది. శనివారం(అక్టోబర్ 28) నుంచి నవంబర్‌ 10వ తేదీ లోపు టెన్త్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 11 నుంచి 16 వరకు రూ.50 ఆలస్య రుసుము, నవంబర్ 17 నుంచి 22 వరకు రూ.200, 23 నుంచి 30వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో పరీక్షల ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. హెచ్‌ఎంలు నిర్ణీత సమయంలోగా పరీక్షల ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని పేర్కొన్నారు.

ప్రభుత్వ బడుల్లో డిజిటల్ టీచర్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. ఐబీ భారతదేశ విభాగం ఇంఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్ మెంట్ బన్నయాన్ లతో ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవల భేటీ అయ్యారు. 10,12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ చేసే ప్రక్రియపై చర్చించారు. సిలబస్ లో మార్పులతో పేద విద్యార్థుల కోసం ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన 'డిజిటల్ టీచర్' సహాయంతో ప్రభుత్వ బడుల్లో జర్మన్, స్పానిష్ భాషలు నేర్పించే విషయమై స్పానిష్, జెర్మనీ ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్, మేనిక్ యూజినా, మతియాస్ స్థాలే లతో చర్చించామన్నారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్

తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబర్‌ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆలస్య రుసుముతో డిసెంబరు 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షలతో పాటు సిలబస్ కు సంబంధించి పలు మార్పులు తీసుకొచ్చిన బోర్డు…. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించే ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను తొలగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులు ఇకపై ఒక ఇంటర్నల్ పరీక్షను మాత్రమే రాయాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం