తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kolkata Doctor Case: క‌ల‌క‌త్తాలో వైద్యురాలిపై అత్యాచారం.. ఏపీలో వైద్య సేవలపై ఎఫెక్ట్

Kolkata Doctor case: క‌ల‌క‌త్తాలో వైద్యురాలిపై అత్యాచారం.. ఏపీలో వైద్య సేవలపై ఎఫెక్ట్

HT Telugu Desk HT Telugu

16 August 2024, 16:42 IST

google News
    • Kolkata Doctor case: క‌ల‌క‌త్తాలో వైద్యురాలిపై అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కేసు ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీలో వైద్య సేవలపై పడింది.
మెడికల్ విద్యార్థుల ఆందోళన
మెడికల్ విద్యార్థుల ఆందోళన

మెడికల్ విద్యార్థుల ఆందోళన

ఈనెల 17న రాష్ట్రంలో వైద్య సేవ‌ల‌న్నీ బంద్‌ చేయాలని ఐఎంఏ ఏపీ కమిటీ పిలుపునిచ్చింది. క‌ల‌క‌త్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌పై 24 గంటలపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. క‌ల‌క‌త్తాలో ఆగస్టు 9న‌ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేశారు. ఈ కేసులో సత్వర న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ.. ఆ ఘ‌ట‌న‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి దాడులను వ్యతిరేకిస్తూ.. ఆగ‌స్టు 17న 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాల‌ని ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క‌మిటీ పిలుపు ఇచ్చింది.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు..

ఐఎంఏ ఏపీ కమిటీ పిలుపుతో.. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా.. ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో నిలిపివేస్తామని ఐఎంఏ ప్రకటించించి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి.. సీబీఐ ఆధ్వర్యంలో విచారణ చేయాలని.. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఐఎంఏ ఏపీ కమిటీ డిమాండ్ చేసింది.

రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి..

ఆసుపత్రుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని.. ఐఎంఏ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌ జేసీ నాయుడు, కార్యదర్శి డీఆర్ ఫణిధర్, కోశాధికారి డీఆర్ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.

మద్దతు కావాలి..

ఈ నిరసన తరువాత‌ ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుంద‌ని ఐఎంఏ ఏపీ విభాగం స్పష్టం చేసింది. తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని స్ప‌ష్టం చేసింది. వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని ఐఎంఏ ఏపీ ప్రతినిధులు కోరారు.

( రిపోర్టింగ్- జగ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )

తదుపరి వ్యాసం