తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. శ్రీకాకుళం టూ అనకాపల్లి జిల్లాలకు అలర్ట్, పోర్టుల్లో ఒకటో నంబర్ వార్నింగ్

AP Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. శ్రీకాకుళం టూ అనకాపల్లి జిల్లాలకు అలర్ట్, పోర్టుల్లో ఒకటో నంబర్ వార్నింగ్

22 October 2024, 14:28 IST

google News
    • AP Cyclone Dana Alerts:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. అది దానా తుఫానుగా మారి తీరంవైపుకు దూసుకొస్తోంది. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఏపీలోని   పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 
ఒడిశాకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం
ఒడిశాకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం

ఒడిశాకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం

AP Cyclone Alerts: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండానికి దానా(Dana)గా పేరు పెట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫానుకు ఇప్పటికే దానాగా నామకరణం చేవారు. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 730 కి.మీ దూరంలో, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో బంగ్లాదేశ్ ఖేపుపరాకు ఆగ్నేయంగా 740 కి.మీ. దూరంలో ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 23 బుధవారం నాటికి తుపానుగా మారనుంది. ఆ తర్వాత, వాయువ్య దిశగా కదులుతూ గురువారం అక్టోబర్ 24 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుంది. అక్టోబర్ 24వ తేదీ రాత్రి - అక్టోబర్ 25 ఉదయంలోపు ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ మరియు సాగర్ ద్వీపం మధ్య Dana తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తుఫాను ప్రభావంతో అక్టోబరు 24, 25 తేదీలలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీరంలో బలమైన గాలులు..

దానా (DANA)తుఫాను ప్రభావంతో పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

బంగాళాఖాతంలో తుపాను నేపద్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్, ఫిషరీస్, పవర్, పోర్ట్స్, పెట్రోలియం&నేచురల్ గ్యాస్ శాఖల కార్యదర్శులు, ఎన్డీఎంఏ మెంబర్, డిఫెన్స్ , డిజి ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిజి ఐఎండి మరియు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ తుపాను హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను క్యాబినెట్ కార్యదర్శికు వివరించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు.

తీర ప్రాంతాలలో నివసించే ప్రజలను అవరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు.

విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ నుంచి వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రభుత్వ లైన్ డిపార్ట్‌మెంట్లు వ్యవసాయ శాఖ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లైస్, ఎనర్జీ, మెడికల్, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. విద్యుత్ ఆటంకం కలిగితే వెంటనే పునరుద్ధించడానికి సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

తుపాను భారీ వర్షాల సమయంలో వ్యాప్తి చెందే వ్యాధుల చికిత్స కోసం అత్యవసర వైద్య మందులను, నిత్య అవసర వస్తువులు, శానిటేషన్ కోసం బ్లీచింగ్,సున్నం, తాగునీటిని క్లోరినేషన్ చేయడానికి క్లోరిన్ మాత్రలతో సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం