Munugode ByPoll : పాల్వాయి స్రవంతికే మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్….
09 September 2022, 13:41 IST
- Munugode ByPoll మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కోమటిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గా ఉంది. ఓ వైపు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు దూకుడు పెంచగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియక గందగరోళం నెలకొంది.
స్రవంతి రెడ్డి పేరును ఖరారు చేసిన ఏఐసిసి
Munugode ByPoll మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ, టిఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నికను రెఫరెండంగా భావిస్తుండటంతో గెలుపు కోసం బీజేపీ, టిఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్నికల సంఘం Munugode ByPoll నోటిఫికేషన్ విడుదల చేయక ముందే ప్రధాన పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభను నిర్వహించినా ఆ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.
మునుగోడు Munugode ByPollఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గెలుపు కూడా ఆ పార్టీకి కీలకమే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. మునుగోడులో ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి పిసిసి అధ‌్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా పార్టీని విడతారని తీవ్రగా ప్రచారం జరిగింది. ఎంపీ వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడిచింది. మునుగోడు సభలో అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీని విడిచి వెళ్లేది లేదని వెంకట్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా విమర్శలు ఆగలేదు. చివరకు తెలంగాణ బాధ్యతలు ప్రియాంక చేపట్టాక వివాదం సద్దుమణిగింది.
ఈ నేపథ‌్యంలో మునుగోడులో Munugode ByPollఇన్నాళ్లు ఎవరికి వారు తామే కాంగ్రెస్ అభ్యర‌్ధి అంటూ ప్రచారం చేసుకున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు దూకుడుగా వ్యవహరించినా కాంగ్రెస్ నేతలు మాత్రం అభ్యర్ధి ఎవరనే విషయం దగ్గరే ఆగిపోయారు. ఎవరు ప్రచారం చేసుకున్న పార్టీకి కలిసి వస్తుందనుకున్నారు. తాజాగా సోనియా గాంధీ అమోదంతో పాల్వాయి స్రవంతి అభ్యర్ధిత్వానికి అమోద ముద్ర వేశారు.
పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె అయిన స్రవంతి రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. స్రవంతిపై కె.ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. తాజాగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి మళ్లీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో స్రవంతి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2009లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి , సిపిఐ అభ్యర్ధి యాదగిరి రావు చేతిలో ఓడిపోయారు. 1967, 1972, 1978, 1983 1999 ఎన్నికల్లో పాల్వాయి ఐదు సార్లు మునుగోడు స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994, 2009లో సిపిఐ అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో సిపిఐ సైతం టిఆర్ఎస్ మద్దతునిస్తోంది. 2014 ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి 38,055ఓట్లతో ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా పోటీ చేసి ఓడిపోయారు.