తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agni Veer : విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం….

Agni veer : విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం….

HT Telugu Desk HT Telugu

14 August 2022, 12:41 IST

google News
    • అగ్నిపథ్‌ పథకంలో భాగంగా అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మందికి పైగా అభ్యర్ధులు అగ్నిపథ్‌ పథకంలో భాగంగా సైన్యంలో చేరేందుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.
ఏపీలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం (ఫైల్‌ఫోటో)
ఏపీలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం (ఫైల్‌ఫోటో) (HT_PRINT)

ఏపీలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం (ఫైల్‌ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్ధులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో మొదలైంది. తొలిరోజు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో 2,700మందికి అవకాశం కల్పించారు. రెండో రోజు నుంచి రోజుకు ఐదు వేల మంది చొప్పున ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఆగష్టు 31 వరకు ర్యాలీ కొనసాగనుంది. జులై 30వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వడంతో భారీగా దరఖాస్తులు అందాయి.

నిరసనలు, ఆందోళనలు, విమర్శల మాటెలా ఉన్నా సైన్యంలో నాలుగేళ్ల తాత్కలిక సర్వీస్‌లో అగ్నివీర్‌ల నియామక ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తోంది. అగ్నిపథ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి ఆగష్టు 31వరకు సైనిక నియామక పరీక్షల్ని నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాలకు చెందిన అభ్యర్ధులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.

మరోవైపు మొట్టమొదటి అగ్నివీర్‌ బ్యాచ్‌ సైనిక నియామకాల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షాలు కురిస్తే బీచ్‌ రోడ్డులో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా ఏపీ పోలీస్‌ శాఖ కూడా విస్తృత ఏర్పాట్లుచేసింది. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు, అవాంతరాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, జివిఎంసి, పోలీసు శాఖల సమన్వయంతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 2700మంది అభ్యర్ధుల్ని మాత్రమే ర్యాలీకి అనుమతిస్తారు. సోమవారం నుంచి ప్రతి రోజు 5వేల మంది అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు వేకువ జాము నుంచి ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి అభ్యర్ధులు ర్యాలీ జరిగే ప్రాంగణానికి చేరుకునేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు.

అగ్నివీర్‌ నియామకాల్లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానంకు చెందిన అభ్యర్ధులను అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ 8th పాస్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులను నిర్దేశిత తేదీలలో మాత్రమే స్క్రీనింగ్‌‌కు అనుమతిస్తారు.

ఆగష్టు 7 నుంచి అభ్యర్ధులకు అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తున్నారు. అడ్మిట్‌ కార్డులోనే ఎప్పుడు, ఎక్కడ ఏ సమయానికి రిపోర్ట్‌ చేయాలో నిర్దేశించారు. అడ్మిట్‌ కార్డ్‌‌ను ప్రింట్‌ తీసుకుని ర్యాలీకి హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎలాంటి మోసపు ప్రకటనలు నమ్మొద్దని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు. ఆర్మీ కాలింగ్‌ పేరుతో లైవ్ చాటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని ఎవరైనా మోసపూరిత హామీలిస్తే నమ్మొద్దని హెచ్చరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం