తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nagarjuna Sagar: రెండేళ్ల తర్వాత నిండిన నాగార్జున సాగర్, దిగువకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

Nagarjuna Sagar: రెండేళ్ల తర్వాత నిండిన నాగార్జున సాగర్, దిగువకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

Sarath chandra.B HT Telugu

06 August 2024, 11:25 IST

google News
    • Nagarjuna Sagar: రాళ్లు తేలి అడుగంటి పోయిన స్థితి నుంచి నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న జల ప్రవాహంతో  సాగర్ గరిష్ట మట్టానికి చేరుకుంటోంది. 
నాగార్జున సాగర్ నుంచి భారీగా నీటి విడుదల
నాగార్జున సాగర్ నుంచి భారీగా నీటి విడుదల

నాగార్జున సాగర్ నుంచి భారీగా నీటి విడుదల

Nagarjuna Sagar: రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు కనిష్ట నీటి మట్టంతో డెడ్‌ స్టోరేజీకి దిగువకు సాగర్‌లో నీటి మట్టం చేరింది. జులై నెలలో కృష్ణా బేసిన్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ప్రాజెక్టుల్లో చేరింది.

గత నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆగస్టు రెండోవారానికి నాగార్జున సాగర్‌ నిండుతుందని అంచనా వేసినా అనూహ్యంగా వారం రోజుల ముందే గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 298 అడుగులకు నీరు చేరింది.

సాగర్‌ ఎగువున భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు 22 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా మంగళవారం 298.58 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. నాగార్జున సాగర్‌కు ప్రస్తుతం ఎగువ నుంచి 3.58 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.సాగర్ చీఫ్‌ ఇంజనీర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో సోమవారం ఉదయం 10.50 గంటలకు 13వ నంబర్ గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. దిగువుకు మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ భూభాగాల్లో ఉన్న 20 క్రస్ట్ గేట్లను ఇరువైపులా ఐదు అడుగుల మేర ఎత్తి 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరోవైపు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,69,914 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 99,153 క్యూసె క్కుల వరద శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుతోంది. శ్రీశైలంలో 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 12 అడుగుల ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206 టిఎంసీల నీటి నిల్వ ఉంది.

సాగర్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు కూడా వేగంగా నిండుతోంది. పులిచింతలకు వరద పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత కృష్ణా జలాలను నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వాటిన సముద్రంలోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు నీటి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వెలిగొండ, బ్రహ్మంగారి మఠం, గండికోట, సోమశిల, కండలేరులకు నీటి విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసినా రాయలసీమలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా లేవు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల అనుమతితో చేయాల్సి ఉంది.

 

తదుపరి వ్యాసం