Sankranti Special Trains : మరో 16 ప్రత్యేక రైళ్లు... శనివారం ఉ. 8 గం. నుంచి రిజర్వేషన్ ప్రారంభం..
30 December 2022, 21:38 IST
- Sankranti Special Trains : సంక్రాంతి పండగకి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. మరో 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లకు డిసెంబర్ 31 ఉదయం 8 గంటల నుంచి ముందస్తు రిజర్వేషన్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
Sankranti Special Trains : సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. అయితే.. పండగకి ఊరు వెళ్లే వారు అధిక సంఖ్యలో ఉండటం.. ఇంకా ఎక్కువ రైళ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో... జనవరిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ప్రకటించిన రైళ్లతో పాటు మరో 16 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ, తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్ డిసెంబర్ 31న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని వెల్లడించింది. రద్దీ అధికంగా ఉండే.. జనవరి 7 నుంచి 18వ తేదీల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
సంక్రాంతి పండగ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఇవే…
సంక్రంతి పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వివిధ ప్రాంతాలకు 94 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు అంతకముందే ప్రకటించారు. ప్రజల నుంచి ఇంకా డిమాండ్ ఉండటంతో.. మరో 30 రైళ్లు ఏర్పాటు చేశారు. ఇవి కూడా సరిపోకపోవడంతో.. రద్దీ ఉండే రోజుల్లో మరో 16 రైళ్లు ప్రవేశపెట్టారు.
పండగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ముఖ్యమైన సందర్భాలు, సెలవులలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వీటిని ఏర్పాటు చేస్తోంది. జనవరి నెలలో సంక్రాంతి పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ బోగీలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను రాత్రి పూట నడపనున్నారు.
ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.