Operation Budameru: ఆపరేషన్ బుడమేరుకు యాక్షన్ ప్లాన్ .. ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నయాలపై కసరత్తు…
20 September 2024, 9:37 IST
- Operation Budameru: విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేసిన బుడమేరు ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఆక్రమణల పాలైన బుడమేరు ప్రవాహ మార్గాన్ని సరిచేసి వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది.
బుడమేరు ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
Operation Budameru: విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేసిన ఆపరేషన్ బుడమేరు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ముందుగా ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ , రెవెన్యూ, సర్వే అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వరదలతో ముంచెత్తుతూ, బెజవాడ దుఃఖ దాయని అనిపేరున్న బుడమేరుకు భవిష్యత్ లో ఆపేరు లేకుండా , విజయవాడ ను ముంపు రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి కిందకు ప్రవహించే పాత ఛానల్ మార్గం , విజయవాడ నగరం,గుడివాడ నుండి, కొల్లేరు మీదుగా వెళ్తుంది. వెలగలేరు, కవులూరు, ఈలప్రోలు,పైడురుపాడు,గొల్లపూడి మీద నుండి, విద్యాధరపురం, విజయవాడ లోని 14,15,16 వార్డులకు సంబంధించి గుణదల, రామవరప్పాడు,ప్రసాదం పాడు,ఎనికేపాడు,వరకు మొత్తంగా 13.25 కిలోమీటర్లు వరకు బుడమేరు ఆక్రమణలకు గురైంది.
బుడమేరు పరివాహక ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ఆక్రమణలకు గురైంది.గా విధ్యాధరపురం నుండి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే 202 ఎకరాల‌్లో 70 ఎకరాలు ఆక్రమణకు గురైంది. వీటిలో 3051 ఇళ్ళ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరు వాస్తవ విస్తరణ ఎంత,ఇందులో ఆక్రమణలు ఎంత అయ్యాయి అని గుర్తించారు.
బుడమేరు దిగువున చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు అండర్ టన్నెల్ సామర్ద్యం పెంచాల్సిన అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు వెళ్ళే 50.6 కిలో మీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయడం, బుడమేరు గట్టును ఎంత మేర, ఎక్కడెక్కడ బలోపేతం చేయాలి.. లైనింగ్ , విస్తరణ పనులు ఎంత మేర చేయాలో సమీక్షించారు.
బుడమేరు పాత ఛానెల్ అంతా నగరంలోని ఇళ్ళ మధ్య నుండి ప్రవహిస్తుండంతో దీనికి సమాంతరంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి పాముల కాలువ, ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడు వరకు బుడమేరు కెనాల్ ను విస్తరణ చేయడం ద్వారా బుడమేరుకు వచ్చే వరద నీటిని మళ్ళించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు
పాముల కాలువ,ముస్తాబాద్ కాలువ లు ఇరిగేషన్ పరంగా ఎంత వరకు విస్తరణ చేయవచ్చు, ఆ ప్రాంతంలో అంతా కూడా వ్యవసాయ భూములే కాబట్టి అక్కడ కి ఉన్న అవకాశాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. అన్ని అంశాలూ ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక ప్రజెంటేషన్ తయారు చేసుకుని యాక్షన్ ప్లాన్ ను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఆయన నిర్ణయాన్ని బట్టి బుడమేరు ఆపరేషన్ ను ప్రారంభిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు.
విజయవాడలో అసలు సమస్య అదే..
విజయవాడ నగరంలో బుడమేరు ఆక్రమణల తొలగింపు ప్రయత్నాలు 20ఏళ్ల క్రితమే జరిగాయి. వైఎస్సార్ ప్రారంభించిన ఆపరేషన్ అప్పట్లో రాజకీయ కారణాలతో అర్థాంతరంగా ఆగిపోయాయి. నగరంలోని బుడమేరు కాల్వ గట్లపై ఉన్న ఆక్రమణల తొలగిస్తే ఓట్లు పోతాయనే ఉద్దేశంతో నేతలు వాటిని అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా బుడమేరుకు ప్రత్యామ్నయంగా పాముల కాల్వను విస్తరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. విజయవాడ వెలుపల ఉన్న పాముల కాల్వ వెంబడి రూరల్ గ్రామాలు విస్తరించాయి. సమీప భవిష్యత్తులో అవి నగరంలో కలిసిపోతాయి. బుడమేరు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడమే మెరుగైన పరిష్కారంగా కనిపిస్తుంది.
కార్పొరేషన్ నిర్లక్ష్యం…
మరోవైపు విజయవాడ నగరం ఎందుకు మునిగిపోయిందనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. విజయవాడ పాతబస్తీలో ఎక్కువ నష్టం జరగడానికి బుడమేరు ప్రధాన కారణం కాదు. అందులో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వైఫల్యం కూడా ఉంది. వరద ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్న ఔట్‌ఫాల్ డ్రెయిన్లను బుడమేరులో కలిపి చేతులు దులుపుకున్నారు. వరదలు వచ్చినపుడు అవే డ్రెయిన్ల నుంచి వరద ప్రవాహం నగరంలోకి సులువుగా వచ్చేసింది. నగరంలో నాలుగైదు చోట్ల ఈ ఔట్ ఫాల్స్ బుడమేరులో కలుస్తాయి. వరదలు వచ్చే సమయంలో అక్కడ నీరు లోపలకు రాకుండా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వరద ప్రవాహం సులువుగా నగరాన్ని ముంచెత్తింది.