CM Leg Pain: భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తుందనే కాలు నొప్పి.. అచ్చెన్నాయుడు
07 April 2023, 9:15 IST
- CM Leg Pain: సతీసమేతంగా సీతారాముల కళ్యాణోత్సవాలకు వెళ్లాల్సి వస్తుందనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలు నొప్పి సాకుతో ఒంటిమిట్టకు వెళ్లలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆరోపించారు. కాలు బెణికిందని ముఖ్యమంత్రి సాకులు చెప్పారని విమర్శించారు.
ఏపీ టీడీపీఅధ్యక్షుడు అచ్చన్నాయుడు
CM Leg Pain: ఒంటిమిట్టలో జరిగిన కోదండరాముడి కళ్యాణోత్సవాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కాలు బెణికిందని సాకులు చెప్పారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆరోపించారు. కాలు నొప్పికారణంగా ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి వెళ్లని ముఖ్యమంత్రి బుధవారం జరిగిన జగజ్జీవన్ రామ్ జయంతి, గురువారం పల్నాడులో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభోత్సవాలకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు.
ఒక్కరోజులోనే ముఖ్యమంత్రికి కాలినొప్పి తగ్గిపోయిందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలితో కోట్లాదిమంది మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచినా బెణకనికాలు, కేవలం సీతారాముల కల్యాణానికి ముందు రోజే బెణుకుంతా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారని రాముల వారి కల్యాణానికి ముఖ్యమంత్రి దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కాలు బెణికిందనే సాకుతో ముఖ్యమంత్రి ఒంటిమిట్టకు వెళ్లలేదని, ముఖ్యమంత్రి వేరే మతాన్ని ఆచరించినా సిఎం హోదాలో ఒంటిమిట్టకు వెళ్లాలన్నారు.
పెళ్లిళ్లకు, పేరంటాలకు సతీసమేతంగా హాజరయ్యే ముఖ్యమంత్రి హిందూ మత కార్యక్రమాలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు ఎందుకు డిక్లరేషన్‌పై సంతకం చేయడం లేదని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తలను ధ్వంసం చేసినా వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అంతర్వేదిలో రథం తగులబెడితే తేనెటీగల వల్ల ప్రమాదం జరిగిందని కేసు మూసేశారని ఆరోపించారు. నాలుగేళ్లలో 280 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి అన్ని మతాలకు, కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు.
హిందూ సంప్రదాయాలను గౌరవించట్లేదు….
హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నా కాలు బెణికిందనే సాకుతో వెళ్లకపోవడమే ఇందుకు నిదర్శనమని ఓ ప్రకటనలో ఆరోపించారు. తర్వాత రోజే చిలకలూరిపేటలో పార్టీ కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. సీఎం ఈ నాలుగేళ్లలో ఒక్కసారయినా సీతారాముల కల్యాణానికి గాని, తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు గానీ సతీసమేతంగా కలిసి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా అని ప్రశ్నించారు.