Killer Daughter: మదనపల్లెలో ఘోరం, పెళ్లి చేసుకోమన్నందుకు తండ్రిని చంపేసిన కుమార్తె
14 June 2024, 7:58 IST
- Killer Daughter: మదనపల్లెలో దారుణహత్య జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నందుకు కన్నతండ్రిని కుమార్తె హతమార్చింది. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
మదనపల్లెలో కన్నతండ్రిని హత్య చేసిన కుమార్తె
Killer Daughter: నచ్చని వారిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుండటంతో కన్న కూతురే తండ్రిని దారుణంగా హతమార్చింది. ఆపై కాలుజారి పడ్డాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ప్రియుడికి సుపారీ ఇచ్చి పక్కా ప్రణాళికతో హత్యకు ప్లాన్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లె ఎగువ కురవవంకకు చెందిన దొరస్వామ (62)ని గురువారం తెల్ల వారుజామున హతమార్చారు.
దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతి చెందడంతో కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతి చెందారు.
సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వలీబ్ బసు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లోనే ఉండటంతో, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడంతో హత్య విషయం బయటపడింది. తొలుత పొంతన లేని సమాధానాలు చెప్పిన నిందితురాలు ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టింది.
మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్‌గా దొరస్వామి ఉంటున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చని పోయారు. అప్పటి నుంచి కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. హరితను బిఎస్సీ బీఈడీ చదివించారు. దొరస్వామి మరికొద్ది నెలల్లో ఉద్యోగం నుంచి రిటైర్ కానున్నారు.
ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో ..కుమార్తెకు పెళ్లి చేయాలని ప్రయత్నాల్లో ఉన్నారు. కుప్పంకు చెందిన ఓ కుటుంబంతో హరితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. రూ.80 లక్షల విలువ చేసే రెండు అంతస్తుల భవనాన్ని కుమార్తెకు పసుపు కుంకుమగా రిజిస్ట్రేషన్ చేశారు.
బుధవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయిన దొరస్వామి తెల్లారేసరికి రక్తపు మడుగులో పడిఉన్నారు. తొలుత తండ్రి కాలి జారిపడి చనిపోయాడని స్థానికుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పటికే హరిత వ్యవహార శైలి, పెళ్లి విషయంలో తలెత్తిన విభేదాలపై స్థానికులతో దొొరస్వామి మాట్లాడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రియుడికి సుపారీ ఇచ్చి హత్య….
ఉపాధ్యాయుడి మరణంపై కుమార్తెను గట్టిగా ప్రశ్నించడంతో అసలు సంగతి బయటపెట్టేసింది. తండ్రిని తానే హతమార్చినట్టు అంగీకరించింది. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని పోలీసులతో చెప్పింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా ఎలాంటి శబ్దాలు వినపడలేదా అని పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తొలుత తండ్రి తనను వేధించినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఆ తర్వాత విచారణలో అసలు విషయం బయటపెట్టింది. దొరస్వామి ఇంటి పై అంతస్తులో హరిత ఉంటోంది. రాత్రి సమయంలో ఆమె ప్రియుడు ఇంటికి వస్తున్న సమాచారం తెలియడంతో కొద్ది నెలల క్రితం ఆ యువకుడిని దొరస్వామి పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఆ యువకుడికి లక్షలు రుపాయలు ఇవ్వడంతో తండ్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు అతడిని మందలించి వదిలేశారు. ఈ క్రమంలో కుమార్తెకు కుప్పంలో పెళ్లి సంబంధం ఖరారు చేయడంతో హరిత అభ్యంతరం చెప్పింది. దీంతో తండ్రిని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో పథకం పన్నింది. వారితో కలిసి దుండగులు హత్య చేసినట్టు డ్రామా ఆడింది.
హరితతో స్నేహం చేస్తున్న యువకుల మొబైల్ నంబర్లు ట్రాక్ చేయడంతో ఒకరు తిరుమలలో, మరొకరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పోలీసులు వారిని సందేహించారు. తండ్రి తాను ఒక్కతే హత్య చేశానని చెప్పినా ఇద్దరు ముగ్గురు కలిసి హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దొరస్వామి గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. కుమార్తె చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. మృతుడి బామ్మర్ది డాక్టర్ నారాయణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.